అస్సాంను ఒకే కుటుంబం దోచేస్తోంది.. సహజ వనరులు పుష్కలం.. ఐనా పేదరికంలోనే ప్రజలు : ప్రియాంకా గాంధీ 

అస్సాంను ఒకే కుటుంబం దోచేస్తోంది.. సహజ వనరులు పుష్కలం.. ఐనా పేదరికంలోనే ప్రజలు : ప్రియాంకా గాంధీ 
  • హిమంత బిశ్వ శర్మ సర్కారుపై కాంగ్రెస్​ ఎంపీ ప్రియాంకా గాంధీ ఫైర్​
  • ప్రభుత్వ ఆస్తులన్నీ కొద్దిమంది పారిశ్రామికవేత్తల పరం
  • బీజేపీ సభలకు రాని మహిళలను బెదిరిస్తున్నారు
  • నామమాత్రపు వేతన పెంపుతో టీ తోట కార్మికులకు అన్యాయం
  • భూమిపుత్రులకు శాశ్వత భూహక్కులు కల్పిస్తామని హామీ

గువాహటి: అస్సాంలో ఒక కుటుంబం రాష్ట్ర సంపదనంతటినీ దోచుకుంలోందని కాంగ్రెస్​ అగ్రనేత, ఎంపీ ప్రియాంకాగాంధీ విమర్శించారు. రాష్ట్రంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ, సామాన్య ప్రజలు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారని అన్నారు. భూములు, గనులు, ప్రభుత్వ ఆస్తులన్నీ కొద్దిమంది పారిశ్రామికవేత్తల పరమవుతున్నాయని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాజీరా, టింగ్‌‌‌‌ఖాంగ్ ప్రాంతాల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు. 

సీఎం హిమంత బిశ్వ శర్మను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అరుణోదయ్’లాంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులైన మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని  పేర్కొన్నారు. ప్రధాని మోదీ,  సీఎం హిమంత నిర్వహించే సభలకు రాకపోతే పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘మహిళలు తమ ఇంటి పనులు చూసుకోవాలా? పనికి వెళ్లాలా? లేక బలవంతంగా రాజకీయ సభలకు హాజరుకావాలా?’’ అని ఆమె ప్రశ్నించారు.