కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్రం

కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్రం
  • పాక్​కు చెందిన దావత్ ఎ ఇస్లామ్ గ్రూప్​తో సంబంధాలు
  • కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్రం
  • ఇద్దరి అరెస్ట్, అదుపులో మరో ఐదుగురు అనుమానితులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న రాజస్థాన్​లోని ఉదయ్​పూర్ టైలర్ హత్య కేసును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)​కి అప్పగించింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఐఎస్​ తరహాలో మర్డర్ జరిగిన ఈ కేసులో టెర్రరిస్టుల కుట్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని ఉత్తర్వులిచ్చింది. మహమ్మద్‌‌ రియాజ్‌‌ అన్సారీ, మహమ్మద్‌‌ ఘోష్‌‌  కలిసి టైలర్ కన్హయ్య లాల్​ను కిరాతకంగా హత్య చేశారు. ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేయగా.. కేసు దర్యాప్తు కోసం రాజస్థాన్ సర్కారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్​ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో స్లీపర్ సెల్స్​ అనే అనుమానంతో పోలీసులు మంగళవారం రాత్రి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎన్​ఐఏ అధికారులు బుధవారం మరో ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

హంతకులకు పాక్​తో సంబంధాలు
ఉదయపూర్‌‌ టైలర్​ని చంపినవాళ్లలో ఒకరైన మహ్మద్ రియాజ్​అన్సారీకి పాక్​ టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. అతడి ఫోన్‌‌లో పాకిస్తాన్​కు చెందిన 10 నంబర్లు ఉన్నాయని తెలిపారు. దావత్ ఎ ఇస్లామ్ అనే గ్రూప్​తో అన్సారీ టచ్​లో ఉన్నాడని తెలిసిందన్నారు. మరో నిందితుడు రెండు సార్లు నేపాల్ వెళ్లి కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్​లతో కలిశాడని చెప్పారు. అతనికి దుబాయ్​లోనూ సంబంధాలున్నట్లు గుర్తించామని చెప్పారు. కన్హయ్యను చంపడానికి ముందు ఇద్దరూ కలిసి అనేక ఐఎస్​ వీడియోలు చూసినట్లు, పాకిస్తాన్​లోని ఫోన్ నంబర్లకు కాల్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు.

సెక్యూరిటీ కోసం కన్హయ్య విజ్ఞప్తి
కన్హయ్య లాల్​కు వారం రోజుల కిందే చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని తెలిసింది. నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కన్హయ్య​ను జూన్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. 15న ఆయన బెయిల్​మీద బయటకు వచ్చాడు. ఆ రోజు నుంచి నజీమ్ అనే వ్యక్తి మరికొందరు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ధన్​మండి పోలీసులకు కన్హయ్య ఫిర్యాదు చేశాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరువర్గాలను ఎస్​హెచ్​వో పిలిపించి నచ్చజెప్పి పంపించేశారే తప్ప టైలర్​కు రక్షణ కల్పించలేదని మండిపడ్డారు. అదే సమయంలో కన్హయ్య లాల్​కు సెక్యూరిటీ కల్పించి ఉంటే ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అంత్యక్రియలకు వేలాది జనం
పోస్ట్ మార్టం తర్వాత టైలర్ కన్హయ్య లాల్ మృతదేహాన్ని పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. కట్టుదిట్టమైన పోలీసుల భద్రత నడుమ బుధవారం అశోక్​నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన అంతిమయాత్రకు వేలాది మంది తరలివచ్చారు. నిందితులను ఉరితీయాలంటూ బంధువులు నినాదాలు చేశారు.