బిల్ డెస్క్ ను టేకోవర్ చేసిన ‘పే యూ’

బిల్ డెస్క్ ను టేకోవర్ చేసిన ‘పే యూ’
  • ఒప్పందం డీల్ విలువ 34.4 వేల కోట్లు

ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ సంస్థ బిల్‌డెస్క్ ను ప్రముఖ ఇంటర్నెట్ సేవల కంపెనీ ప్రొసస్‌ కంపెనీ టేకోవర్‌ చేసింది. ఏకంగా 470 కోట్ల డాలర్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 34 వేల 400 కోట్లకు) కొనుగోలు చేసింది. ఈ ఒప్పందానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదముద్ర వేయాల్సి ఉంది. పే యూ (PayU) అనే ఫిన్‌టెక్‌ కంపెనీ మాతృసంస్థే ప్రొసస్‌. ఆర్థర్‌ ఆండర్సన్‌ సంస్థలో పనిచేసిన అజయ్ కుషాల్,  ఎంఎన్‌ శ్రీనివాసు,  కార్తిక్‌ గణపతి 2000 సంవత్సరంలో బిల్‌డెస్క్ ను ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే మన దేశంలో లాభదాయకమైన ఫిన్‌ టెక్‌ కంపెనీలలో ఒకటిగా నిలిచింది బిల్‌ డెస్క్‌. ప్రస్తుతం దేశంలో ఉన్న అతి పెద్ద ఆన్‌లైన్‌ పేమెంట్‌ కంపెనీలలో బిల్ డెస్క్ ఒకటి.

ఈ ఆర్ధిక సంవత్సరం అంటే 2021లో బిల్ డెస్క్ రూ.270 కోట్ల నికర ఆదాయం సాధించింది. ఈ నేపధ్యంలో  ‘‘పేయూ’’ ద్వారా భారత్ లో డిజిటల్ చెల్లింపు సేవలు అందిస్తున్న పోసెన్ కంపెనీ బిల్ డెస్క్ ను సొంతం చేసుకుంది. భారత్‌లో ఇప్పటి వరకు  600 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టామని, బిల్‌డెస్క్‌ డీల్‌ ద్వారా భారత్‌లో తమ పెట్టుబడుల మొత్తం 1000 కోట్ల డాలర్ల మార్కును దాటిపోయామని  ప్రొసస్‌ కంపెనీ సీఈఓ బాబ్‌ వాన్‌ డిక్‌ వెల్లడించారు.