సిటీలోకి కొత్త క్యాబ్స్​ ‘ప్రైడో’

సిటీలోకి కొత్త క్యాబ్స్​ ‘ప్రైడో’

హైదరాబాద్‌‌, వెలుగు: సిటీలో మరో కొత్త క్యాబ్‌‌ అగ్రిగేటర్‌‌ రంగంలోకి దిగింది. ప్రైడో పేరిట క్యాబ్‌‌ సర్వీసులను ముందుగా హైదరాబాద్‌‌లోనూ, ఆ తర్వాత ఇతర మెట్రో నగరాలలోనూ మొదలు పెట్టనున్నట్లు వెంకట ప్రణీత్‌‌ టెక్నాలజీస్‌‌ తెలిపింది. హైదరాబాద్‌‌లో 14 వేల మంది డ్రైవర్లు ఇప్పటికే తమ భాగస్వాములైనట్లు కంపెనీ మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ నరేంద్ర కుమార్‌‌ కామరాజు వెల్లడించారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు విస్తరించేందుకు  రాబోయే ఏడాది కాలంలో రూ. 100 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు. సిటీలో ఈ నెల 29 నుంచి ప్రైడో సేవలు మొదలవుతాయని, ఆండ్రాయిడ్‌‌, ఐఓస్‌‌లు రెండింటిలోనూ తమ యాప్‌‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. అటు డ్రైవర్లకు, ఇటు కస్టమర్లకు పారదర్శకమైన పద్ధతిలో సేవలు ఇచ్చే విధంగా యాప్‌‌ను అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించినట్లు తెలిపారు. హ్యాచ్‌‌బాక్‌‌, సెడాన్‌‌, ఎస్‌‌యూవీ మూడు విభాగాలలోనూ ప్రైడో సేవలు పొందవచ్చని అన్నారు. ప్రణీత్‌‌ గ్రూప్‌‌ పేరిట రియల్‌‌ ఎస్టేట్‌‌ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్నామని, సొంత నిధులతోనే ప్రైడోను మొదలుపెడుతున్నామని నరేంద్ర కుమార్‌‌ చెప్పారు. మూడు నెలల్లో నగరంలో 10 లక్షల రైడ్స్‌‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డ్రైవర్లను హ్యాపీగా ఉంచితే రైడర్లు హ్యాపీగా ఉంటారనేదే తమ కంపెనీ సిద్ధాంతమని అన్నారు. దీనికి అనుగుణంగానే తమ బిజినెస్‌‌ మోడల్‌‌ రూపొందించినట్లు పేర్కొన్నారు. రైడ్స్‌‌ సంఖ్య ఆధారంగా నెలకు 0 నుంచి 10 శాతం కమిషన్‌‌ను డ్రైవర్ల నుంచి ఛార్జ్‌‌ చేయనున్నట్లు తెలిపారు.  బిల్లింగ్‌‌, ఇన్వాయిసింగ్‌‌లో  ప్రైడో పూర్తి పారదర్శకత పాటించనున్నట్లు చెప్పారు. గత 12 ఏళ్లలో హైదరాబాద్‌‌లో 22 ప్రాజెక్టులు పూర్తి చేసిన ప్రణీత్‌‌ గ్రూప్‌‌ టర్నోవర్‌‌ రూ. 300 కోట్లకు చేరిందని నరేంద్ర కుమార్‌‌ తెలిపారు.