- ఆసుపత్రి సామాగ్రి ధ్వంసం.. అడ్డుకోబోయిన పోలీస్‌కూ గాయాలు
- ఉన్మాదిని పట్టుకుని చితకబాదిన స్థానికులు.. గాంధీకి తరలింపు
ఘట్కేసర్, వెలుగు: ఘట్కేసర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. చాకుతో చొరబడి డాక్టర్లు, రోగులపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఉన్మాది అకస్మాత్తుగా ఆసుపత్రిలోకి ప్రవేశించి, తాను రైలు నుంచి కింద పడ్డానని, తనకు వెంటనే చికిత్స చేయకపోతే చంపేస్తానంటూ చేతిలో ఉన్న చాకుతో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, చికిత్స పొందుతున్న రోగులపై దాడికి దిగాడు.
ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా హాస్పిటల్ సామగ్రిని, ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించాడు. దీంతో రోగులు, వారి బంధువులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఆసుపత్రి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఉన్మాది రోడ్డుపై వెళ్లేవారిపై దాడికి తెగబడ్డాడు.
సమాచారం అందుకున్న ఘట్కేసర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులపై కూడా తిరగబడటంతో ఓ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఆ సైకోను చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉన్మాదిని మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
