V6 News

పీవీ మోడర్న్​ ఇండియాకి మార్గదర్శి!

పీవీ మోడర్న్​ ఇండియాకి మార్గదర్శి!

1991లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రి పదవిలోకొచ్చేసరికి.. ప్రపంచంలో కోల్డ్​ వార్​ చిట్టచివరి దశకు చేరుకుంది. అప్పటి వరకు అమెరికా, రష్యాల కూటమిలో చేరకుండా అలీనం (నాన్​–అలైన్​డ్​)గా ఇండియా లాంటి దేశాలకు కొత్త సవాళ్లెదురయ్యాయి. మ్యాన్​ఫ్యాక్చరింగ్​, సర్వీసు సెక్టార్లలో సొంతంగా ఎదగకపోతే మనుగడ సాగించడం కష్టం. వ్యవసాయ ప్రధానమైన ఇండియాలో విత్తనం, విద్యుత్​, ఎరువులు, క్రిమిసంహారకాలకు ఎవరిపైనా ఆధారపడకుండా స్వావలంబన సాధించాల్సిన సమయంలో పీవీ ప్రధానిగా వచ్చారు.

1989 తర్వాత వచ్చిన రెండు ప్రభుత్వాల హయాంలో సోషల్​ డిస్టర్బెన్స్​ చాలా జరిగింది. మండల్​–కమండల్​ పేరుతో మొత్తం భారతీయ సమాజం రెండుగా విడిపోయింది. మరోపక్క పేమెంట్స్​ బిల్లు పెరిగిపోయింది. చెల్లింపులకోసం మన ఖజానాలోని బంగారాన్ని ఇంగ్లాండ్​ బ్యాంక్​లో తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. రెండోపక్కన మండల్​ కమిషన్​ అమలుకోసం నిరుద్యోగ యువత రోడ్డెక్కింది.

ఇలాంటి దశలో ప్రధాని పదవిని తీసుకోవడమంటే ముళ్ల కిరీటాన్ని తగిలించుకోవడమే! పీవీ మౌనమే తన భాషగా మొత్తం పరిస్థితిని మొదటి ఫైనాన్షియల్​ క్వార్టర్​లోనే అర్థం చేసుకున్నారు. సంస్కరణలకు తెగించి అడుగేశారు. ప్రభుత్వం చేతిలో ఉండే మ్యాన్​ఫ్యాక్చరింగ్​, ప్రొడక్షన్​ సెక్టార్లలో ప్రైవేటు రంగానికి తలుపులు తెరిచారు. మండల్​ కమిషన్​ ద్వారా నియామకాలు జరిపించి నిరుద్యోగానికి కొంతమేర చెక్​ పెట్టారు. అల్లకల్లోలంగా ఉన్న పంజాబ్​లో ఎన్నికలు నిర్వహించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. జమ్మూ కాశ్మీర్​లో వేర్పాటువాదులను కట్టడి చేయగలిగారు. ఆర్థిక రంగంలో పి.వి. తీసుకొచ్చిన సంస్కరణలతో దేశ ఆర్థిక, పారిశ్రామిక రంగం పూర్తిగా కొత్త రూపం దాల్చాయి. దేశీయంగా రిఫార్స్మ్​తో స్పీడ్​ పెంచడంతోపాటుగా అంతర్జాతీయంగానూ ఇండియా పేరు ప్రతిష్టలు పెంచగలిగారు.

సరైన సమయంలో సరైన వ్యక్తులు

సంక్షోభానికి సరైన సమయంలో, సరైన వ్యక్తులతో పరిష్కారాన్ని సాధించడమనేది పీవీ స్టయిల్​గా చెప్పాలి. ఆయన 1991లో ప్రధానమంత్రి కాగానే ఆనవాయితీకి భిన్నంగా నాన్​–పొలిటికల్​ ఎకనామిస్ట్​ని ఫైనాన్స్​ మినిస్టర్​గా తీసుకున్నారు. మొదట ఆర్​బీఐ మాజీ గవర్నర్​ ఐ.జి.పటేల్​ని ఆర్థిక మంత్రిగా తీసుకోవాలనుకుంటే ఆయన ఒప్పుకోలేదు. పటేల్​ సిఫారసుతో మన్మోహన్​ సింగ్​ని కేబినెట్​లోకి తీసుకున్నారు. పీవీ –మన్మోహన్​ జోడీ తీసుకున్న నిర్ణయాలతో ఇండియన్​ బ్యాంకర్స్​, కామర్స్​, ఇండస్ట్రీ, స్టాక్​ ఎక్సేంజ్​ల రూపురేకలు మారిపోయాయి. మందకొడిగా సాగిన ఇండియా ప్రయాణం ఒక్కసారిగా వేగం పుంజుకుందని ఆర్థికవేత్తలు చెబుతారు.

అంతా రెడీ చేసి… వాజ్​పేయికిచ్చారు!

పీవీ మొదటి మూడేళ్లు ఆర్థిక సంస్కరణలపైనే దృష్టి పెట్టారు. తర్వాత రెండో విడత పోఖ్రాన్​ అణు పరీక్ష లకు రంగం సిద్ధం చేశారు. ఎన్నికలు ముంచుకురావడంతో అనుమతి ఇవ్వలేకపోయారని అంటారు. ‘‘అంతా రెడీగా ఉంది, పొయ్యి ముట్టించడమే తరువాయి’’ అని పీవీ చెప్పారని.. ఆయన చనిపోయినప్పుడు వాజ్​పేయి బయటపెట్టారు. పోఖ్రాన్ అణు పరీక్షల క్రెడిట్​ అంతా పీవీదేనని వాజ్ పేయి కూడా ఒప్పుకున్నారు. ‘‘పీవీ రెడీ చేసిన సామగ్రితో ప్రయోగం జరిపించానంతే’’ అని వాజ్​పేయి అన్నారు.

ఆయనదొక ప్రత్యేక ఒరవడి

పీవీపై ఉండే పెద్ద ఆరోపణ ఏమిటంటే… దేనికీ చలించని బండరాయి అని! నిజానికి అదే ఆయన స్ట్రాటజీ.
ఎవరి విషయంలోనైనా ఏమైనా ఆరోపణలొచ్చాయని తెలిస్తే ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అనేవారు. ఎవరికీ ప్రొటెక్షన్​ ఇవ్వాల్సిన అవసరం లేదని, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా బుద్ధి కర్మానుసారిణి అని నమ్మేవారు.

ఇటువంటిదే మరొకటి… ‘సమస్యను సాగదీయడంకూడా పరిష్కారంలో భాగమే’ అనేది. అన్ని సమస్యలకు ఛప్పున పరిష్కారం దొరకదు. వాటిని కొంతకాలం సాగదీయడం ద్వారా ఏదోక దగ్గర పరిష్కరం లభించక పోదు. పీవీ ఈ పద్ధతిలోనే పంజాబ్​, జమ్మూకాశ్మీర్​, ఈశాన్య రాష్ట్రాలకు పరిష్కారాలు వెదుక్కున్నారు.

మెత్తటి పులి

ధర్మరాజును ‘మెత్తటి పులి’గా వర్ణించాడు తిక్కన. ఈ ఉపమానం పి.వి.నరసింహారావుకు సరిగ్గా సరిపోతుంది. ఆయన ప్రధాని అయ్యే సమయానికి చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​గా టి.ఎన్​.శేషన్​ ఉన్నారు. ఎన్నికల సంస్కరణలను నిక్కచ్చిగా అమలు చేసి మంచి పేరు గడించారు. అయితే, ఆయన పట్టువిడుపులు లేని సివిల్​ సర్వంట్​. దాంతో ఆయనకు అటు ఇటు రెండు కుర్చీలు వేసి… త్రిసభ్య కమిషన్​గా మార్చేశారు పి.వి. రాజ్యాంగబద్దంగా తీసుకున్న ఈ నిర్ణయంవల్ల చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా పోయింది. మెజారిటీ ఓటు ప్రకారం నడుచుకోవలసి వచ్చేది.

తెలుగంటే తగని ప్రేమ

పీవీ నరసింహారావు స్వయానా పండితులు. ఆయనకు 17 భాషలు వచ్చునని చెబుతారు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయి పడగలు’ నవలను హిందీలోకి అనువదించారు. ప్రధానిగా ఉన్న రోజుల్లో ఓసారి హైదరాబాదులో జరిగిన అవధానాలకు వచ్చి, పృచ్ఛకులలో ఒకరిగా పాల్గొని అవధానిని ఆశీర్వదించి వెళ్లారు. అలాంటి ఒక సందర్భంలో ‘తెలుగు భాష బతుకు, భవిష్యత్తు’ పట్ల రచయితలు ఆవేదన వ్యక్త చేశారు. అంతా విన్నాక… ‘తెలుగు భాష స్వయం పోషకత్వంగలది. తనను తాను బతికించుకోగలదు. ఆ శక్తి మన తెలుగు భాషకు ఉంది’ అని భరోసా ఇచ్చారు పీవీ.

నా అంత సీనియర్​కి ఇంత చిన్న పదవా?

పీవీ ప్రధాని కావడం నార్తిండియన్​పొలిటికల్ లాబీకి ఏమాత్రం ఇష్టం లేదు. అనివార్యంగా ఒప్పుకోవలసి వచ్చింది. ఆయన తన కేబినెట్​లో అసంతృప్తి వర్గానికి చెందిన అర్జున్​ సింగ్​కి కూడా చోటిచ్చారు. హ్యూమన్​ రీసోర్స్​ డెవలప్​మెంట్​ శాఖను ఇచ్చారు. అసలే కుతకుతలాడుతున్న అర్జున్​ సింగ్​ ఈ మినిస్ట్రీని చూసి మరీ మండిపడ్డారు. ‘నా అంత సీనియర్​కి ఇంత చిన్న పదవి ఇచ్చి అవమాన పరుస్తారా?’ అని పీవీని నిలదీశారు. పీవీ చాలా కూల్​గా ‘ఈ మినిస్ట్రీకి ఫస్ట్​ మినిస్టర్​ ఎవరో తెలుసా?’ అన్నారు. అంతే, అర్జున్​ సింగ్​ నోరెత్తకుండా వెళ్లిపోయారు. ఎడ్యుకేషన్, కల్చరల్, లాంగ్వేజెస్​ తదితర శాఖలన్నింటినీ కలిపి ఈ మినిస్ట్రీగా మార్చారు రాజీవ్​ గాంధీ. ఆ పదవిని అందుకున్న మొట్టమొదటి మినిస్టర్​ పీవీనే.