V6 News

పంజా విసిరిన పంజాబ్ కింగ్స్.. లక్నోను చిత్తు చేసిన శ్రేయస్ సేన!

పంజా విసిరిన పంజాబ్ కింగ్స్.. లక్నోను చిత్తు చేసిన శ్రేయస్ సేన!

PBKS vs LSG: ఐపీఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) తమ విజయ పరంపరను కొనసాగించింది. ముల్లాన్‌పూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ 54 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పంజాబ్ నిర్దేశించిన 255 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక లక్నో అట్టర్ ప్లాప్ అయింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఓపెనర్ ఆయూష్ బదోనీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 21 బంతుల్లో 35 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. కానీ 61 పరుగుల వద్ద విజయ్‌కుమార్ వైశాఖ్ బదోనీని అవుట్ చేయడంతో లక్నో తొలి వికెట్ కోల్పోయింది.  

పోరాడిన పంత్, మార్ష్, మార్క్రమ్:  
తొలి వికెట్ పడ్డాక మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మార్ష్ (28 బంతుల్లో 40 పరుగులు) ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో యుజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మాయాజాలంతో అతడిని పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత పంజాబ్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడిన కెప్టెన్ పంత్, హాఫ్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ (9) మరోసారి నిరాశపరచగా, తర్వాత క్రీజులోకి వచ్చిన ఐడెన్ మార్క్రమ్ ఒంటరి పోరాటం చేశాడు. మార్క్రమ్, ముకుల్ చౌదరి భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించినా, అప్పటికే లక్ష్యం లక్నోకు అందనంత ఎత్తుకు చేరిపోయింది. మార్క్రమ్ చివరి ఓవర్లో అవుట్ కావడంతో లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. 

లక్నోను కట్టడి చేసిన పంజాబ్ బౌలర్లు: 
పంజాబ్ కింగ్స్ జట్టు విజయంలో మార్కో యాన్సెన్ కీలకమైన 2 వికెట్లతో కీ రోల్ పోషించగా, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసి లక్నో పతనాన్ని శాసించారు. ఈ అద్భుత విజయంతో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జట్టు అజేయంగా దూసుకుపోతుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలతో పంజాబ్ కింగ్స్ నెంబర్ వన్ స్థానానికి దూసుకుపోయింది.