పేరు మార్చి క్యూనెట్‌ కంపెనీ మోసాలు

పేరు మార్చి  క్యూనెట్‌ కంపెనీ మోసాలు
  • పేరు మార్చి క్యూనెట్‌  కంపెనీ మోసాలు
  •     ‘వీ ఎంపైర్’ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్‌
  •     ఏపీకి చెందిన ఒకరి అరెస్టు.. రూ.54 కోట్లు ఫ్రీజ్
  •     స్వప్నలోక్  కాంప్లెక్స్ లోనే ‘ఈ స్టోర్ ఇండియా’ పేరుతో మరో కంపెనీ చీటింగ్‌
  •     ఇద్దరి అరెస్టు.. రూ.6.5 కోట్లు ఫ్రీజ్

హైదరాబాద్‌,వెలుగు : క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్  గుట్టు మరోసారి బయటపడింది.‘వీ ఎంపైర్‌’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన గుమ్మడిల్లి రాజేష్  అలియాస్ రాజేష్‌  ఖన్నాను సిటీ సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. క్యూనెట్‌ విహాన్ డైరెక్ట్  సెల్లింగ్‌ సంస్థకు చెందిన 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్లు ఫ్రీజ్‌  చేశారు. ‘వీ ఎంపైర్‌’ పేరుతో 159 మంది బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. సికింద్రాబాద్ స్వప్నలోక్  కాంప్లెక్స్​లో నిర్వహించిన వీ ఎంపైర్‌‌ వివరాలను సీసీఎస్ డీసీపీ శభరీస్‌తో కలిసి సీపీ ఆనంద్  మీడియాకు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన గుమ్మడిల్లి రాజేష్‌  బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. క్యూ నెట్‌ విహాన్‌  డైరెక్ట్‌  సెల్లింగ్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి సికింద్రాబాద్‌ స్వప్నలోక్  కాంప్లెక్స్​లో ‘వీ ఎంపైర్’ పేరుతో ఆఫీస్‌  ఓపెన్ చేశాడు. 12 మందితో ఆర్‌‌ఓసీ రిజిస్టర్ చేశాడు. నిరుద్యోగులను స్వయం ఉపాధి పేరుతో నిందితులు ట్రాప్  చేశారు. తక్కువ టైమ్ లో  ఎక్కువ లాభాలు, విలువైన గిఫ్టులు ఇస్తామని నమ్మించారు. వివిధ రకాల వస్తులను డైరెక్ట్‌  సెల్లింగ్ చేయడంపై తరగతులు నిర్వహించారు. పిరమిడ్‌ (మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌)లో వస్తువులను మార్కెటింగ్‌ చేస్తే ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని నమ్మించారు.

రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశ

రూ.20. వేలు పెట్టుబడి పెట్టినవారికి మూడు నెలల్లో రూ.60 వేలు డిపాజిట్‌ చేస్తామని నిందితులు చెప్పారు. డైరెక్ట్‌ సెల్లింగ్‌లో జాయిన్ అయిన వారి వద్ద రూ.50 వేల నుంచి రూ.1.5 లక్ష వరకు రిజిస్ట్రేషన్  ఫీజు వసూలు చేశారు. గత ఏడాది కాలంలో 159 మందికి పైగా అమాయకులను మోసం చేశారు. 

ఈ–స్టోర్‌‌ ఇండియా స్కీమ్స్ చీటింగ్‌

క్యూనెట్‌ మోసాలు మరోసారి వెలుగు చూడడంతో సీసీఎస్  పోలీసులు మల్టీ లెవల్‌  మార్కెటింగ్‌పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈ–స్టోర్‌‌  ఇండియా లిమిటెడ్  పేరుతో  స్కీమ్స్  నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. హిమాయత్‌ నగర్‌‌కు చెందిన మనీష్ కట్టి, మలక్‌పేటకు చెందిన అజ్మల్‌ మెహిది సజ్జద్‌  ఈ–స్టోర్‌‌ ఆపరేట్ చేస్తున్నారు. తమ సంస్థలో రూ.8991 పెట్టుబడి పెడితే రూ.9000 విలువ చేసే హెల్త్  ప్రోడక్టులు అందిస్తామని నమ్మించారు. 44 మంది వద్ద రూ.25 లక్షల చొప్పున వసూలు చేసి 300 మందికి పైగా మోసం చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు  వారి వద్ద నుంచి రూ.6.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. దేశవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు  సీపీ తెలిపారు.