ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ లోకి నడాల్‌ కమాల్

ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ లోకి నడాల్‌ కమాల్

పారిస్‌‌‌‌:  స్పెయిన్‌‌ బుల్‌‌ రఫెల్‌‌ నడాల్‌‌.. క్లే కోర్టులో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. అత్యద్భుతమైన ఆటతో ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో సెమీఫైనల్‌‌ బెర్త్‌‌ను సాధించాడు. మంగళవారం అర్ధ రాత్రి జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో ఐదోసీడ్‌‌ నడాల్‌‌ 6–2, 4–6, 6–2, 7–6 (7/4)తో వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌, డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌, టాప్‌‌సీడ్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌ (సెర్బియా)పై సంచలన విజయం సాధించాడు. దీంతో 14వ సారి ఫ్రెంచ్​ టైటిల్​  కోసం మరో అడుగు ముందుకేశాడు. అలాగే కెరీర్‌‌లో రికార్డు స్థాయిలో 22వ మేజర్‌‌ ట్రోఫీకి రెండు అడుగుల దూరంలో నిలిచాడు. శుక్రవారం 36వ పడిలోకి అడుగుపెడుతున్న నడాల్‌‌.. సెమీస్‌‌లో థర్డ్‌‌ సీడ్‌‌ అలెగ్జాండర్‌‌ జ్వెరెవ్‌‌ (జర్మనీ)తో తలపడనున్నాడు. మరోవైపు విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో వరుసగా 33వ మ్యాచ్​ గెలిచిన టాప్‌‌సీడ్‌‌ స్వైటెక్‌‌ (పోలెండ్‌‌) సెమీస్‌‌లోకి ప్రవేశించింది.  2020లో ఫ్రెంచ్​ ఓపెన్​ నెగ్గిన స్వైటెక్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో 6-–3, 6–-2తో 11వ సీడ్​ జెస్సీకా పెగులా (అమెరికా)ను వరుస సెట్లలో చిత్తు చేసింది. 21 ఏళ్ల స్వైటెక్​ సెమీస్​లో రష్యా ప్లేయర్​ డరియా కసాట్కినాతో పోటీ పడనుంది. మరో క్వార్టర్స్​లో కసాట్కినా 6-–4, 7–-6 (7/5)తో కుద్రెమెటోవా (రష్యా)ను ఓడించి సెమీస్​ చేరుకుంది.

పోరాటం.. అదుర్స్‌‌

ఫైనల్‌‌కానీ... క్వార్టర్స్‌‌లో నడాల్‌‌, జొకో ప్రతీ పాయింట్‌‌కూ హోరాహోరీగా పోటీపడ్డారు. ఓ రకంగా ఫైనల్‌‌ను తలపించిన ఈ మ్యాచ్‌‌లో భిన్నమైన షాట్లు, సర్వీస్‌‌ల్లో పదును, రిటర్న్‌‌ షాట్స్‌‌లో డెప్త్‌‌ చూపిన స్పెయిన్‌‌ స్టార్‌‌ను విజయం వరించింది. జొకో కూడా ఎక్కడా తగ్గలేదు. కానీ క్రాస్‌‌ కోర్టు రిటర్న్స్‌‌ను తీయడంలో వెనకబడ్డాడు. 4 గంటలా 12 నిమిషాల పోరాటంలో.. జొకో తొలి సెట్‌‌లో ఫస్ట్‌‌, ఐదో గేమ్‌‌లను చేజార్చుకున్నాడు. రెండో సెట్‌‌లోనూ జొకో ఫస్ట్‌‌, థర్డ్‌‌ గేమ్‌‌ను బ్రేక్‌‌ చేసిన నడాల్‌‌ ఫోర్త్‌‌ గేమ్‌‌లో సర్వీస్‌‌ను కోల్పోయాడు. తర్వాత ఇరువురూ సర్వీస్‌‌ కాపాడుకోవడంతో స్కోరు 3–3తో సమం అయ్యింది. అయితే పదో గేమ్‌‌లో నడాల్‌‌ సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసి జొకో సెట్‌‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌‌లో మళ్లీ జొకో.. తొలి, ఐదో గేమ్‌‌ను కోల్పోయి సెట్‌‌ను వదిలేసుకున్నాడు. మ్యాచ్‌‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలుగోసెట్‌‌ టైబ్రేక్‌‌లో జొకో చేతులెత్తేశాడు. రెండో గేమ్‌‌లో నడాల్‌‌ సర్వ్‌‌ను బ్రేక్‌‌ చేసిన జొకోవిచ్‌‌ 3–0 లీడ్‌‌లో నిలిచాడు. తర్వాత ఇరువురు సర్వ్‌‌లను కాపాడుకున్నా.. తొమ్మిదో గేమ్‌‌లో జొకొ సర్వ్‌‌ను నడాల్‌‌ బ్రేక్‌‌ చేసి 5–5తో స్కోరు సమం చేశాడు. తర్వాత ఇద్దరూ సర్వీస్‌‌లను నిలబెట్టుకోవడంతో సెట్‌‌ టైబ్రేక్‌‌కు దారి తీసింది. టైబ్రేక్‌‌లో జొకో అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌ ఎక్కువగా చేయడం నడాల్‌‌కు కలిసొచ్చింది.