బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ, రేపు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇక వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిషా ప్రాంతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని... రానున్న రెండు, మూడు రోజుల్లో ఆవర్తనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు.
నిన్నటి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ జిల్లాలోని రుద్రంగిలో 13 సెంటీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇల్లంతకుంటలో 12, చందుర్తి మండలం మర్రిగడ్డలో 11, సిరిసిల్ల మండలం పెద్దూరులో 11 సెంటీ మీటర్ల వానపడింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ లో 13 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. జయశంకర్ జిల్లా టేక్ మట్లలో 11 సెంటీ మీటర్ల వానపడింది.
గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కుత్బుల్లా పూర్ , రాజేంద్రనగర్, శివరాంపల్లిలో 3 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. పటాన్ చెరులో 3.1, జీడిమెట్లలో 3.5,బాలాజీ నగర్ లో 3 సెంటీ మీటర్ల వానపడింది. మరో మూడు రోజులు వర్షం పడే అవకాశం ఉందని, వాతావరణశాఖ చెప్పడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు.
