‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా ఈనెల 24న ఎస్‌కేఎం దేశవ్యాప్త నిరసన

‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా ఈనెల 24న ఎస్‌కేఎం దేశవ్యాప్త నిరసన

‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేష్ తికాయిత్‌ మరో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తేదీన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నిరసనలు చేస్తుందని రాకేష్ తికాయిత్‌ తెలిపారు. సంయుక్త కిసాన్‌ మోర్చాకు చెందిన పలు రైతు సంఘాల నేతలు సోమవారం (జూన్ 20న) సమావేశమయ్యారు. త్రివిధ దళాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా జూన్ 24న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో, ప్రధాన కార్యాలయాల్లో ఐక్య కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు చేస్తామని రాకేష్‌ తికాయిత్‌ తెలిపారు. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిరసనలకు యువకులు, పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో వేలాది మంది ఉత్తరాది రైతులు దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఏడాదికిపైగా నిరసనలు కొనసాగించారు. దీంతో దిగివచ్చిన కేంద్రం వివాదస్పదంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ స్కీమ్‌ అగ్నిపథ్‌ను కూడా వెనక్కి తీసుకోవాలంటూ యువత దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) కూడా దీనికి మద్దతు తెలిపింది.