మాటలన్న వాళ్లే పూల మాలలు వేశారు

మాటలన్న వాళ్లే పూల మాలలు వేశారు

ఈ కాలం పిల్లలు లైఫ్‌‌లో ఎదగాలంటే ‘మంచి కాలేజీలోనే చదవాలని, తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉండాలని అనుకుంటుంటారు. కానీ, అవేవీ అక్కర్లేదని నిరూపించాడు ఐఏఎస్‌‌ ఆఫీసర్‌‌‌‌ రమేష్‌‌ ఘోలప్‌‌. ఏదైనా సాధించాలనే పట్టుదలుంటే జీవితంలో ఎదురయ్యే ఏ సవాలు మీకు అడ్డుపడదని చెప్తున్న రమేష్‌‌ కథ..

రమేష్‌‌ది మహారాష్ట్ర, షోలాపూర్‌‌‌‌లోని మహాగావ్‌‌ అనే పల్లెటూరు. తండ్రి గోరక్‌‌ ఘోలప్‌‌ సైకిల్‌‌ రిపేర్‌‌‌‌ షాప్ నడిపించేవాడు. సంపాదనలో సగం అతని తాగుడుకే ఖర్చయ్యేది. మిగతా డబ్బుతో ఇద్దరు పిల్లల పోషణతో పాటు ఇల్లు గడవడం కష్టం అయింది. తాగుడు అలవాటు వల్ల అనారోగ్యం పాలై కొన్నాళ్లకు గోరక్‌‌ చనిపోయాడు. ఇక అప్పటినుంచి కుటుంబ బాధ్యత తల్లి విమల పైనే పడింది. ఆమె రోజూ కూలి పనికి వెళ్లేది. ఆ పని దొరకనప్పుడు బుట్టలో గాజులు పెట్టుకొని వీధులన్నీ తిరిగి అమ్మేది. అప్పుడు ఆమెకు తోడుగా ఇద్దరు కొడుకులు కూడా వెళ్లేవాళ్లు. 

పిల్లల చదువు పాడవ్వద్దని
రమేష్‌‌కు కుడికాలికి పోలియో వచ్చింది. అయినా తల్లితో పాటు గాజులమ్మడానికి వెళ్లేవాడు. కుటుంబంలో ఇబ్బందులవల్ల పిల్లల భవిష్యత్తు పాడు కాకూడదని ఇద్దరినీ గవర్నమెంట్‌‌ స్కూల్లో చేర్చింది విమల. ‘బాగా చదివి జాబ్ తెచ్చుకుంటే, ఈ కష్టాలన్నీ తీరతాయని’  చెప్పేది. రమేష్‌‌ కూడా బాగా చదివేవాడు. ఎగ్జామ్స్‌‌లోనే కాకుండా క్విజ్‌‌ పోటీల్లో పాల్గొని గెలిచేవాడు. రమేష్‌‌ తెలివి చూసినవాళ్లంతా ‘గొప్పవాడివి అవుతావు’ అనేవాళ్లు. దాంతో రమేష్‌‌ను కష్టాలకు దూరంగా ఉంచి మంచి చదువు చదివించాలి అనుకునేది విమల. అతన్ని తీసుకెళ్లి బర్శీలోని తన అన్న ఇంట్లో ఉంచి చదివించింది. టెన్త్, ఇంటర్‌‌ పరీక్షల్లో తొంభై శాతం మార్కులతో పాసయ్యాడు. డి.ఈడి. (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్‌‌) పూర్తి చేశాడు. ఆ ఊళ్లో ఉన్న స్కూల్‌‌లో టీచర్‌‌‌‌గా పనిచేస్తూ ఫ్యామిలీకి ఫైనాన్షియల్‌‌ సపోర్ట్‌‌ ఇచ్చేవాడు. వీళ్లకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు వేరొకరికి ఇచ్చాడని తహశీల్దార్‌‌‌‌‌‌తో గొడవపెట్టుకున్నాడు రమేష్‌‌. ఎంత ట్రై చేసినా పై అధికారులంతా తహశీల్దార్‌‌‌‌కే సపోర్ట్‌‌ చేశారు. అప్పుడే ‘నేను కూడా గవర్నమెంట్‌‌ ఆఫీసర్‌‌‌‌ అవ్వాలి’ అని నిర్ణయించుకున్నాడు రమేష్‌‌. కొన్ని రోజులు సివిల్​ సర్వీసెస్​కి ప్రిపేర్‌‌‌‌ అయి, 2009లో ఎగ్జామ్‌‌ రాశాడు. కానీ, క్వాలిఫై కాలేదు. దాంతో రమేష్‌‌ ఎదిరించినవాళ్లంతా ‘వీధులు తిరిగి గాజులమ్ముకునేవాడు సివిల్​ సర్వీసెస్​ రాస్తే ఇలానే ఉంటుంది’. ‘కుంటోడివి. కుర్చీలో కూర్చొని పాఠాలు చెప్పుకోక ఇవన్నీ నీకెందుకు’ అని ఎద్దేవా చేశారు.

ఒట్టు వేసి...   
ఆ మాటలు విన్న రమేష్‌‌ ఎలాగైనా సివిల్​ సర్వీసెస్​లో ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఉద్యోగం సాధించాకే ఊళ్లో అడుగు పెడతానని ఒట్టు వేసి పూణె వెళ్లాడు. కోచింగ్‌‌ తీసుకుంటూ రెండేండ్లు కష్టపడ్డాడు. అతనికి ఏ ఇబ్బంది కలగకుండా ఊళ్లో అప్పు చేసి డబ్బులు పంపిం చేది తల్లి. తరువాత 2012లో జరిగిన ఎగ్జామ్స్‌‌లో ఆలిండియా 287వ ర్యాంక్ సాధించి, అప్పుడు ఊళ్లో అడుగుపెట్టాడు. అతన్ని మాటలన్నవాళ్లే పూల మాలలు వేసి ఊరేగించారు. ఇప్పుడు జార్ఖండ్‌‌ ఎనర్జీ డిపార్ట్‌‌మెంట్‌‌లో జాయింట్‌‌ సెక్రటరీగా పని చేస్తున్నాడు రమేష్‌‌. 

‘‘అన్నీ అందరికీ దొరకవు. కానీ, దొరకలేదని అక్కడే ఆగిపోవద్దు. అనుకున్నది కష్టమైనా సాధించాలనే నమ్మకంతో ముందుకెళ్లాలి. అప్పుడు కూడా జీవితం మనల్ని పరీక్షిస్తుంది. కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అయినా నిరాశ పడొద్దు. ప్రయత్నించాలి. 
ఓపికతో ఎదురుచూస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది’’ అంటాడు రమేష్‌‌.