Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ గడ్డపై భారత్ మ్యాచ్‌లు

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ గడ్డపై భారత్ మ్యాచ్‌లు

ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. పాకిస్తాన్‌‌లోనే ఈ టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. అయితే బీసీసీఐ మాత్రం పాక్ ‌లో పర్యటించేది లేదని తెగేసి చెప్తోంది.సరిహద్దు సమస్యలు ఓ కొలిక్కి వచ్చేవరకూ దాయాది దేశానికి వెళ్లేది లేదని ఖరాకండిగా చెప్తోంది. దీంతో దాయాది క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇదిలా ఉంటే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం భారత్ మ్యాచ్ లను పాకిస్థాన్ లో ఆడాలని ప్రతిపాదించినట్టు నివేదికలు చెబుతున్నాయి. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అన్ని టీమ్ ఇండియా మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంను వేదికగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ ఒప్పుకుంటుందో లేదో ప్రస్తుతం చర్చనీయాంశయంగా మారింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ, లాహోర్,రావల్పిండిలను వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలుగా ప్రకటించింది.  పాకిస్థాన్ లో భారత్ పర్యటించనందున హైబ్రిడ్ మోడల్ లోనే ఈ టోర్నీ జరిగే అవకాశం కనిపిస్తుంది. చివరిసారిగా 2017 లో ఛాంపియన్స్ జరిగింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ పై పాకిస్థాన్ ఫైనల్లో గెలిచి టైటిల్ గెలుచుకుంది. 

2023 ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగింది. పాక్ వేదికగా ఆసియా కప్‌ నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో హైబ్రిడ్‌ మోడల్‌లో భారత్‌ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి. అచ్చం 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా అలానే జరుగనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పీసీబీ నిర్ణయాన్ని అంగీకరిస్తుందో లేకపోతే పాక్ కు వెళ్ళేది లేదని తమ పంతం నెగ్గించుకుంటుందో చూడాలి.