క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మొత్తం డేటా గుర్తుపెట్టుకోండి

 క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మొత్తం డేటా గుర్తుపెట్టుకోండి

క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అయితే ఇకపై మొత్తం డేటా గుర్తుపెట్టుకోవాల్సిందే. లేకపోతే కార్డును ఉపయోగించడం కుదరదు. ఎందుకంటే ’’రిమెంబర్ మి‘‘ అనే ఆప్షన్ ను పేమెంట్ గేట్ వేలలో తొలగిస్తున్నారు. క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులను రెగ్యులర్ గా వాడే వారు ఇప్పటి వరకు చాలా వరకు పేమెంట్‌ గేట్‌వేలలో ఒకసారి క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు డేటాను ఎంటర్‌ చేసిన తర్వాత గుర్తు పెట్టుకొమ్మని చెబితే... ప్రతిసారీ అది ఆటోమేటిగ్గా తీసుకుంటుందన్న విషయం తెలిసిందే.
రిమెంబర్ మి అనే ఆప్షన్ ను ఉపయోగించుకోవడం వల్ల కార్డు ఉపయోగించేటప్పుడంతా మీరు మొత్తం డేటాను అంటే.. 16 అంకెల కార్డు నంబర్‌, కార్డు గడువు పూర్తయ్యే తేదీ, సంవత్సరం, సీవీవీ నంబర్‌ ప్రతిసారీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే పేమెంట్‌ గేట్‌వే కంపెనీలు ఇలా డేటాను స్టోర్‌ చేసుకుంటుండడం వల్ల ఈ డేటాను ఆ కంపెనీలు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వచ్చే జనవరి 1, 2022 నుంచి ఈ ఆప్షన్‌ను ఆర్బీఐ తొలగించాలని నిర్ణయించింది. 
ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రకారం పేమెంట్‌ గేట్‌వేలు మీ డేటాను స్టోర్‌ చేసుకునే అవకాశం ఉండదు. డెబిట్ కార్డు లేదా క్రెడిట్‌ కార్డు వాడే ప్రతిసారీ మీరు మీ కార్డు 16 అంకెల నంబరు, తేదీ, ఏడాది... సీవీవీ నంబర్‌ ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం వల్ల కొంత సమయం పట్టవచ్చేమోగాని.. ఖాతాదారుల డేటా భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే  మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు డేటా మొత్తం గుర్తు పెట్టుకోవడం నేర్చుకుంటే బెటర్. 
రిమెంబర్ మి అనే ఆప్షన్ వల్ల సెకన్లలో ట్రాన్జాక్షన్ కు అలవాటు పడిన వారు ఇక నుంచి  ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌కు వెళ్లినా... లేదా ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీ చేసిన ప్రతిసారీ ఈ మొత్తం డేటా ఎంటర్‌ చేయాల్సిందేనని ఆర్బీఐ చెబుతోంది. సైబర్ నేరాలు, అనుమానాలకు అవకాశం లేకుండా చేసేందుకే Remember me ... అనే ఆప్షన్‌ కు బ్రేక్ వేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.