- అందనంత ధరలో 10 వేల టికెట్
- రూ.వెయ్యి టికెట్ రూ.20 వేలు
- యథేచ్ఛగా ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా
- మరోవైపు నకిలీ డిస్ట్రిక్ట్ యాప్‌తో దండుకుంటున్న కేటుగాళ్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ శుక్రవారం సాయంత్రం జరగనుండగా బ్లాక్ టికెట్ల దందాకు తెర లేచింది. ఉప్పల్‌స్టేడియం దగ్గర రూ.వెయ్యి టికెట్‌ను రూ.20 వేలకు, రూ.10 వేల టికెట్‌ను రూ. లక్షకు అమ్ముతున్నారన్న ప్రచారం సాగుతోంది. సీజన్లో హైదరాబాద్‌కు ఉప్పల్‌లో చివరి మ్యాచ్‌కావడం, విరాట్‌కోహ్లీపై క్రేజ్‌తో ఫ్యాన్స్ఎంతంటే అంత ధర పెట్టి మరీ కొంటున్నారు.
ఐదు రోజుల ముందే సోల్డ్ అవుట్
స్టేడియంలో 39 వేల సీటింగ్ కెపాసిటీ ఉండగా, ఫ్రాంచైజీలు మ్యాచ్ కు ఉన్న డిమాండ్‌ను బట్టి అధికారికంగా రూ.వెయ్యి నుంచి రూ.50 వేల వరకు ఆన్ లైన్ ప్లాట్ ఫాం డిస్ట్రిక్ యాప్ లో అమ్ముతున్నాయి. మామూలుగా చెన్నై, ముంబై, ఆర్సీబీలతో మ్యాచ్ లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాగే, శుక్రవారం ఆర్సీబీతో లీగ్ లో చివరి మ్యాచ్ కావడంతో డిస్ట్రిక్ యాప్ లో ఐదు రోజుల ముందుగానే టికెట్లన్నీ అయిపోయాయి.
టికెట్స్ సేల్కు వచ్చిన కొన్ని సెకన్లలోనే సోల్డ్అవుట్అయిపోయాయి. ఎప్పుడూ లేనంతగా నాలుగు లక్షల క్యూ కనిపించింది. దీనిపై ఫ్యాన్స్అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లో ఎలా టికెట్లు అయిపోతాయని, బ్లాక్‌దందా నడుస్తోందని ఆరోపిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల రంగ ప్రవేశం
ఈ ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ లో జరగనున్న చివరి మ్యాచ్ కావడం, విరాట్ కోహ్లీకి క్రేజ్ఉండడంతో ఎలాగైనా సరే మ్యాచ్ చూడాలని సన్ రైజర్స్, ఆర్సీబీ అభిమానులు టికెట్ల కోసం ఆన్ లైన్ లో, వెబ్ సైట్స్‌లో వెతకడం మొదలుపెట్టారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు, బ్లాక్ లో టికెట్స్ అమ్మే మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. టికెట్ కావాలంటే తమ లింక్ ఓపెన్ చేయాలని, తమ యూపీఐ ఐడీకి డబ్బులు పంపిస్తే టికెట్లు ఇస్తామని చీట్చేస్తున్నారు. ఇలా కూడా సాధ్యం కాని వారు ఎలాగైనా సరే మ్యాచ్ చూడాలని, బ్లాక్ లో అయినా టికెట్ కొనాలని ఉప్పల్ స్టేడియం వద్దకు క్యూ కడుతున్నారు.
స్టేడియం వద్ద దందా..
ఫ్యాన్స్ఆశను ఆసరాగా చేసుకుని కొందరు రూ.వెయ్యి టికెట్ ను రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, రూ. 10 వేల టికెట్ రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు అమ్ముతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కానీ, ఇవి నిజం టికెట్లా లేక ఫేక్టికెట్లా అన్నది తెలియడం లేదు. అయితే, చాలా మంది ముందుగానే యాప్ లో టికెట్లను కొని బ్లాక్ లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్ టికెట్ల దందాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎవరైనా బ్లాక్ టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
అభిమానులకు సైబర్ నేరగాళ్ల వల..
సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తున్నారని, వీటిపై జాగ్రత్తగా ఉండాలని సైబర్‌సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అభిమానులను అలర్ట్ చేశారు. లాస్ట్ మినిట్ టికెట్ ఆఫర్స్ పేరిట మోసాలు చేస్తున్నారని చెప్తున్నారు.
అడిషనల్ టికెట్స్ బుకింగే లేదు..
ప్రతి మ్యాచ్ కి అడిషనల్ టికెట్స్ బుక్చేసుకోవడానికి ఒక రోజు ముందు అవకాశం ఇస్తారు. కానీ, ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కు అడిషనల్ టికెట్స్ బుకింగ్ కి అవకాశం లేదు. దీంతో గత మ్యాచ్ ల కంటే ఎక్కువ రేట్లకు టికెట్స్ ను ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచేజీ అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, గత ఢిల్లీ ఆర్సీబీ మ్యాచ్ లో కూడా బ్లాక్ టికెట్ల వ్యహహారం బయటపడింది.
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ లో ఓ ఉన్నతాధికారి దాదాపు 1000 కాంప్లిమేంటరీ పాస్ (టికెట్ల)ను ఎక్కువ రేట్ కు అమ్ముకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి విచారించారు. దీంతో ఢిల్లీ ఉన్నతాధికారి విషయం బయటపడింది. ఈ టికెట్లను ఏకంగా రూ. 80 వేల నుంచి రూ. లక్షల వరకు బ్లాక్ లో అమ్మినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు.
