భద్రాచలం మన్యంలో రెడ్​ అలర్ట్

భద్రాచలం మన్యంలో రెడ్​ అలర్ట్

భద్రాచలం/వెంకటాపురం, వెలుగు: మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో భద్రాచలం మన్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గోదావరి వరదల కారణంగా రాకపోకలు బంద్ అవడంతో ఇటీవల వెంకటాపురం, చర్ల, చింతూరు, చట్టి, జగదల్ పూర్ గ్రామాల్లో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను పోలీస్​పహారా మధ్య సోమవారం భద్రాచలం తీసుకొచ్చారు. ఈ నెల 3 వరకు రాత్రి పూట భద్రాచలం- నుంచి వెంకటాపురం, చర్ల, చింతూరు, సీలేరు, జగదల్​పూర్, కూనవరంకు వెళ్లే బస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దులోని ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు సంస్మరణ సభలు నిర్వహిస్తుండడంతో వారాంతపు సంతలను రద్దు చేశారు. అక్కడి బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

మీటింగుల పేరుతో ఏజెన్సీలోని ఆదివాసీలను మావోయిస్టు పార్టీ పీడిస్తోందని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఓఎస్డీ సాయిమనోహర్ సోమవారం ఓ ప్రకటన రిలీజ్​చేశారు. సంస్మరణ సభలకు రాకపోతే ఇంటికి రూ.3వేలు జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారని, ప్రతి ఆదివాసీ రూ.200 పార్టీ ఫండ్​తీసుకురావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన గ్రామాల నుంచి ఎవరూ సంస్మరణ సభలకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, పినపాక, మణుగూరు మండలాలకు చెందిన లీడర్లు తమ అనుమతి లేకుండా ఏజెన్సీ గ్రామాల్లోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. అలాగే ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు,పేరూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని సరిహద్దు ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ టీమ్స్ తో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్న ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీ నేతలను పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. సోమవారం వెంకటాపురం ఎస్సై రేఖ అశోక్, వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు వెహికల్స్​తనిఖీ చేశారు. మావోయిస్టు కమిటీ సభ్యులు, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని వెంకటాపురం సీఐ బండారి కుమార్ కోరారు. గ్రామాల్లో మావోయిస్టుల పోస్టర్లు అంటించారు.