ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉంటే ఏంటీ? ఊడితే ఏంటీ? : కిషన్​రెడ్డి

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉంటే ఏంటీ? ఊడితే ఏంటీ? : కిషన్​రెడ్డి
  • కాంగ్రెస్ సర్కారును కూల్చే ఆలోచన మాకు లేదు: కిషన్​రెడ్డి
  • ఈ నాలుగున్నరేండ్లలో మా బలం పెంచుకుంటం
  • మీట్ ది ప్రెస్​లో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక సీటు గెలిస్తే దేశానికి ఏం లాభం లేదు.. గెలవకున్నా నష్టం లేదు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఉంటే ఏంటీ?.. ఊడితే ఏంటీ?” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ కు ఒక్క ఓటు వేసినా వృథా అవుతుందని, ఎవ్వరూ ఓటును వృథా చేసుకోవద్దని కోరారు. అహంకారం, అవినీతి, నియంతృత్వంతో కూడిన బీఆర్ఎస్​తో తాము కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశం, తెలంగాణ కోసం బీజేపీలో చేరాలని విపక్ష పార్టీల నాయకులను కోరారు. 

ఆదివారం హైదరాబాద్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన  మీట్ ది ప్రెస్  కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన తమకు లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో కూలిపోతే తమకు సంబంధం లేదని తెలిపారు. వచ్చే నాలుగున్నరేండ్ల వరకూ వేచి చూస్తామని, అప్పటి వరకూ తమ బలాన్ని పెంచుకుంటామని చెప్పారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలకు పీడకలలు పెరిగిపోయాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ను యూటీ చేసే ఆలోచన ఇప్పట్లో లేదని అన్నారు. 

తెలంగాణలో అభివృద్ధికి కేంద్రం గత పదేండ్లలో రూ.9 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిందని చెప్పారు. దేశంలో 32 ఏండ్ల తర్వాత  2014లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని, 2019 లో అంతకన్న ఎక్కువ సీట్లు ఇచ్చి ప్రజలు మోదీకి మద్దతు తెలిపారని చెప్పారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో  ముస్లిం మహిళలు మోదీని తమ సోదరుడిగా భావిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లు తీసేస్తామంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని చూసి ప్రజలే నవ్వుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రానికి తొమ్మిదిన్నర లక్షల కోట్లు ఇస్తే.. గాడిద గుడ్డు ఇచ్చారని అంటారా? అని మండిపడ్డారు. ఆ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. 

రిజర్వేషన్లపై దుష్ర్పచారం చేస్తున్నారు    

తన కంఠంలో ప్రాణముండగా రిజర్వేషన్లు తీసే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ చెప్పినా.. ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. రాజకీయాల్లో ఉంటే బాధ్యతతో ఉండాలని, సీఎం హోదాలో ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడుతారా? అని రేవంత్​నుద్దేశించి అన్నారు. పేదరికం నుంచి అన్ని వర్గాలు బయటకు వచ్చేవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని చెప్పారు.  బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని అర్థమై,  పార్టీలో తన అస్థిత్వానికి ఎక్కడ నష్టం జరుగుతుందోనని ఆత్మరక్షణ ధోరణిలో సీఎం రేవంత్​మాట్లాడుతున్నాడని విమర్శించారు. దేశ భవిష్యత్తు, అభివృద్ధి, గౌరవం కోసం బీజేపీకి ఓటేయాలని కోరారు.  జూన్ 4న వెలువడే ఫలితాల్లో ప్రభంజనాన్ని చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.