ఉడుకుతున్న సింగరేణి.. ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ గనుల్లో 46 డిగ్రీల టెంపరేచర్లు

ఉడుకుతున్న సింగరేణి..  ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ గనుల్లో 46 డిగ్రీల టెంపరేచర్లు

గోదావరిఖని, వెలుగు: ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఓపెన్‌‌‌‌కాస్ట్‌‌‌‌ గనుల్లో 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఓసీపీల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు విలవిలలాడుతున్నారు. యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగులు ఎండలోనే పనిచేయాల్సి వస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా సింగరేణిలో షిఫ్ట్‌‌‌‌ టైమింగ్స్‌‌‌‌ మార్చాలని కార్మికులు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు.

కనిపించని రక్షణ చర్యలు

సింగరేణి ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ల్లో మట్టి తొలగింపు (ఓవర్‌‌‌‌ బర్డెన్‌‌‌‌)తో పాటు బొగ్గు తొలగింపు కోసం నిరంతరం బ్లాస్టింగ్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్లాస్టింగ్‌‌‌‌ చేసే ఉద్యోగులు, ఓబీ కంపెనీకి చెందిన సిబ్బంది క్వారీలోకి వెళ్తారు. ప్రస్తుతం ఎండ తీవ్రత కారణంగా బయటి కన్నా క్వారీలో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం క్వారీలో ఐదారు చోట్ల తుంగ కప్పిన రెస్ట్‌‌‌‌ షెల్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటర్​ కోసం రంజన్లను అందుబాటులో ఉంచాలి. కానీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ మ్యాట్‌‌‌‌తో రెస్ట్‌‌‌‌ షెల్టర్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. 

క్వారీలో వేడిగాలులు వీచినప్పుడు షెల్టర్‌‌‌‌లో ఉన్న వారు తట్టుకలేకపోతున్నారు. ఇక డంపర్లు, షవల్, డోజర్‌‌‌‌ వంటి మెషీన్లను బేస్‌‌‌‌ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లలో రిపేర్‌‌‌‌ చేస్తారు. ఈ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లు ఓపెన్‌‌‌‌గానే ఉండడంతో కార్మికులు, ఉద్యోగులు ఎండలోనే పనిచేయాల్సి వస్తోంది. అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక కొందరు ఉద్యోగులు గొడుగులు, అట్టముక్కలు అడ్డు పెట్టుకుని పనిచేస్తున్నారు. వర్క్‌‌‌‌షాప్‌‌‌‌ల వద్ద షెల్టర్లను నిర్మించడంలో మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యూనియన్‌‌‌‌  లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉద్యోగులు రెస్ట్‌‌‌‌ తీసుకునే చోట సరిపడా కూలర్లను ఏర్పాటు చేయకపోవడంతో వారు ఎండవేడిని తట్టుకోలేక పోతున్నారు.

పనిచేయని మెషీన్లు

ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లలో వెలికితీసిన బొగ్గును క్వారీలో నుంచి సర్ఫేస్‌‌‌‌కు తీసుకువచ్చేందుకు డంపర్లను, వాటిలో బొగ్గును నింపేందుకు షావల్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ను ఉపయోగిస్తుంటారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా మెషీన్ల ఇంజన్లు హీట్‌‌‌‌ అవుతున్నాయి. దీంతో వాటిని కొద్దిసేపు పక్కన పెట్టాల్సి వస్తోంది. వేడి తగ్గిన తర్వాత తిరిగి మెషీన్లను ఉపయోగించుకోవాల్సి వస్తోంది.

షిఫ్ట్‌‌‌‌ టైమింగ్స్‌‌‌‌ మార్చాలని డిమాండ్‌‌‌‌

సింగరేణి ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లలో పనిచేసే ఉద్యోగులకు మూడు షిప్టులుగా డ్యూటీలను నిర్ణయించారు. ఫస్ట్‌‌‌‌ షిఫ్ట్‌‌‌‌ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు, రెండవ ఫిష్ట్‌‌‌‌ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, నైట్‌‌‌‌ షిఫ్ట్‌‌‌‌ రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఉంటుంది. అయితే ఉదయం నుంచే ఎండ మండిపోతుండడంతో షిఫ్ట్‌‌‌‌ టైమింగ్స్‌‌‌‌ను మార్చాలని గతంలో యూనియన్‌‌‌‌ లీడర్లు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ను కోరారు. 

ఫస్ట్‌‌‌‌ షిఫ్ట్‌‌‌‌ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఫస్ట్‌‌‌‌ఫిష్ట్‌‌‌‌ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మార్చాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ పట్టించుకోవడం లేదంటూ గోదావరిఖనిలోని ఓసీపీ 5 వద్ద ఉద్యోగులు, కార్మికులు ఏఐటీయూసీ సెక్రటరీ ప్రభుదాస్‌‌‌‌ ఆధ్వర్యంలో శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్‌‌‌‌ మేనేజల్‌‌‌‌ అనిల్‌‌‌‌ గబాలేకు వినతిపత్రం అందజేశారు.