టీఎస్ లాసెట్ లో.. 80.21% మంది క్వాలిఫై

టీఎస్ లాసెట్ లో.. 80.21%  మంది క్వాలిఫై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని లా కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 80.21% మంది క్వాలిఫై అయ్యారు. గురువారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​లో ఓయూ వీసీ రవీందర్, కౌన్సిల్ సెక్రటరీ శ్రీనివాస్​రావు, లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మీతో కలిసి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను రిలీజ్ చేశారు. మే 25న మూడు సెషన్లలో నిర్వహించిన లాసెట్, పీజీఎల్ సెట్ కు 43,692 మంది రిజిస్టర్ చేసుకోగా.. 36,218 మంది ఎగ్జామ్ రాశారు. అందులో 29,049 మంది క్వాలిఫై అయ్యారు.

ఎల్ ఎల్ బీ మూడేండ్ల కోర్సులో బొద్దు శ్రీరామ్ (ఏపీ), ఎల్ ఎల్ బీ ఐదేండ్ల కోర్సులో మహమ్మద్ మహబూబ్ (యూపీ), ఎల్ఎల్​ఎం కోర్సులో టి.రవీంద్రబాబు (ఏపీ) టాపర్లుగా నిలిచారు. అలాగే, ఎక్కువ మంది ఎల్​ఎల్​బీ మూడేండ్ల కోర్సుకే ఆసక్తి చూపారు. ఈ కోర్సుకు మొత్తం 25,747 మంది పరీక్ష రాయగా.. 20,234 మంది క్వాలిఫై అయ్యారు. ఐదేండ్ల ఎల్ ఎల్​ బీ కోర్సుకు 6,039 మంది, ఎల్​ఎల్​ఎం కోర్సుకు 2,776 మంది అర్హత సాధించారు. ఈ సందర్భంగా చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26 కాలేజీల్లో లా కోర్సులకు పర్మిషన్ ఉందన్నారు. ఎల్ ఎల్ బీ మూడేండ్ల కోర్సులో 4,130 సీట్లు, ఐదేండ్ల కోర్సులో 1,900, ఎల్ఎల్​ఎం కోర్సులో 930 సీట్లున్నాయని తెలిపారు. త్వరలోనే అడ్మిషన్​ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. లాసెట్ అధికారులు జీబీరెడ్డి, రాధిక తదితరులు పాల్గొన్నారు. 

బీటెక్ నుంచి లా వైపు...

జనరల్ డిగ్రీ స్టూడెంట్లతో పాటు బీటెక్, ఎంబీబీఎస్ చేసిన వారు కూడా లా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన లాసెట్​లో మూడేండ్ల ఎల్​ఎల్​బీ కోర్సుకు 20,234 మంది క్వాలిఫై అయితే, దాంట్లో 4,033 మంది బీటెక్, బీఈ అభ్యర్థులు, 50 మంది ఎంబీబీఎస్, 27 మంది బీడీఎస్ అభ్యర్థులు ఉన్నారు.​ అలాగే, వివిధ ఉద్యోగాలు చేసి రిటైర్​అయిన వారు, 60 ఏండ్లు దాటిన వ్యక్తులూ లా కోర్సులు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఎలాంటి ఏజ్ లిమిట్ లేకపోవడంతో ఇటువైపు వస్తున్నారు.