మే 1 నుంచి విలేజ్‌ బస్ ఆఫీసర్లు

మే 1 నుంచి విలేజ్‌ బస్ ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో ప్యాసింజర్లను ఆకట్టుకునేందుకు  బస్‌‌  ఆఫీసర్లను నియమించాలని ఆర్టీసీ నిర్ణయించింది. విలేజ్‌‌  బస్‌‌  ఆఫీసర్ల నియామకం, విధివిధానాలకు సంబంధించిన గైడ్​లైన్స్ ను శనివారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌‌  జారీ చేశారు. బస్‌‌ ఆఫీసర్లను వీలైనంత త్వరగా నియమించాలని అధికారులను ఆదేశించారు. ఈ బస్‌‌  ఆఫీసర్ల వ్యవస్థ వచ్చే నెల  ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని గైడ్​లైన్స్​లో పేర్కొన్నారు.

గ్రామాల్లో నివసించే సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్‌‌  బస్‌‌  ఆఫీసర్లుగా డిపో మేనేజర్లు నియమిస్తారు. పెద్ద గ్రామానికి ఒకరు, చిన్న గ్రామాలైతే మూడు గ్రామాలకు ఓ ఆఫీసర్​ను నియమించనున్నారు. హైదరాబాద్‌‌ సహా మిగతా మున్సిపాలిటీల్లోనూ వార్డుకు ఒక బస్‌‌  ఆఫీసర్‌‌ను డిపో మేనేజర్లు నియమిస్తారు. 15 రోజులకు ఒకసారి గ్రామాల్లో పర్యటిస్తూ  బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌‌లు, కొత్త సర్వీసులు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరించి, పైఅధికారులకు తెలియజేస్తారు. కాగా, రాష్ట్రంలో 12,769 గ్రామాలు ఉండగా 10 వేల గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడుపుతుండగా, 2 వేల మందిని నియమించనున్నారు. 

ఆఫీసర్లు గ్రామాలకు వెళ్లి ఏం చేస్తరు?

రాష్ట్రంలో 2 వేల గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, బస్సుల్లేని గ్రామాలకు ఆఫీసర్లు వెళ్లి ఏం చేస్తారని యూనియన్  నేతలు ప్రశ్నిస్తున్నారు. చాలా గ్రామాల్లో కాలేజీ స్టూడెంట్ల  కోసం ఉదయం, సాయంత్రం ఒకే ఒక సర్వీసు వేస్తున్నారని తెలిపారు. గత తొమ్మిదేండ్లలో  సుమారు 5 వేల బస్సులను తగ్గించారని, రెవెన్యూ రావడం లేదని గ్రామాలకు బస్సుల సంఖ్య తగ్గిస్తున్నారని నేతలు చెబుతున్నారు.