మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్

మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్
  • రెండు రోజుల పర్యటన
  • ఆ తర్వాత హైదరాబాద్​లో ఇరిగేషన్ ఆఫీసర్లతో మీటింగ్

హైదరాబాద్, భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ మేడిగడ్డను సందర్శించనున్నారు. పిల్లర్లు కుంగి డ్యామేజ్ అయిన బ్యారేజీని మంగళవారం ఆయన పరిశీలించనున్నారు. సోమవారం సాయంత్రం ఆయన కోల్‌‌‌‌‌‌‌‌కతా నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌‌‌‌‌‌‌‌సీ అనిల్ కుమార్, డిప్యూటీ ఈఎన్‌‌‌‌‌‌‌‌సీ కె.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు.

 తన సతీమణితోపాటు వచ్చిన జస్టిస్ ఘోష్‌‌‌‌‌‌‌‌కు.. తాజ్ కృష్ణలో ఇరిగేషన్ శాఖ బస ఏర్పాటు చేసింది. అక్కడే సోమవారం సాయంత్రం ఆయన ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాతో భేటి అయ్యారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మరికొన్ని ప్రాథమిక విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఎన్‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ నిపుణుల కమిటీ రిపోర్టు ఎప్పుడొస్తుందని అడిగినట్టు సమాచారం.

 కాగా, మంగళవారం మేడిగడ్డకు వెళ్లి బ్యారేజీలను పరిశీలించనున్న ఆయన అక్కడ పలువురు నిపుణులతోనూ భేటీ అవుతారని తెలుస్తున్నది. రెండు రోజులు అక్కడే ఉండి బ్యారేజీకి సంబంధించిన విషయాలను తెలుసుకోనున్నారు. బుధవారం మధ్యాహ్నం బయల్దేరి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు రానున్నారు. గురువారం బీఆర్‌‌‌‌‌‌‌‌కే భవన్‌‌‌‌‌‌‌‌లోని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆఫీసులో ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు.