మోదీతో సబ్​కా వికాస్​ కాదు .. దేశ్​కా సత్తెనాశ్ : కేసీఆర్​

మోదీతో సబ్​కా వికాస్​ కాదు .. దేశ్​కా సత్తెనాశ్ :  కేసీఆర్​
  • అచ్చే దిన్ కాదు.. అంతా సచ్చే దిన్​
  • చార్​ సౌ పార్ ​అంటున్నరు.. 200 సీట్లు కూడా దాటయ్​
  • సెంట్రల్​లో బీజేపీ, కాంగ్రెస్​ గవర్నమెంట్​ రాదు.. ప్రాంతీయ శక్తుల పాలననే
  • కాలిరిగి కట్టెపట్టినా పోరాటం మాత్రం ఆపను
  • రైతు రుణమాఫీ కక్కించేదాకా వదిలిపెట్ట
  • ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్​ మెడలు వంచుత
  • నిజామాబాద్​ కార్నర్​ మీటింగ్​లో బీఆర్ఎస్​ చీఫ్ ప్రసంగం

నిజామాబాద్​, వెలుగు: మోదీతో సబ్​ కా వికాస్​ కాదు.. సబ్​ కా సత్తెనాశ్​ అని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ ఎద్దేవా చేశారు. అబ్​కే బార్​ చార్​సౌ పార్ అని మోదీ నినదిస్తున్నా.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 200 సీట్లు కూడా దాటవని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నిజామాబాద్​ నగరంలో నిర్వహించిన బీఆర్ఎస్​ కార్నర్ ​మీటింగ్​లో కేసీఆర్​ ప్రసంగించారు. ‘‘నేను సీఎం అయినప్పుడే మోదీ పీఎం అయిండు. పదవిలో కూర్చోక ముందు, ఆ తర్వాత ఆయన150 దాకా వాగ్దానాలు ఇచ్చిండు. 

ఇందులో ఏవీ అమలు కాలే. సబ్​కాసాత్..​ సబ్​కా వికాస్​,  అచ్చేదిన్​, మేకిన్​ ఇండియా, డిజిటల్​ ఇండియా, బేటీ బచావో.. బేటీ పడావో వంటి గొప్ప నినాదాలతో ప్రధాని మోదీ ప్రజలను భ్రమ పెట్టిండు. జన్​ధన్​ యోజన కింద రూ.15 లక్షలు బ్యాంకు అకౌంట్​లో జమ చేస్తానని ఇప్పుడు ఉత్తి గ్యాస్​ చూపుతున్నరు”అని విమర్శించారు.  గోదావరి నీళ్లను తమిళనాడుకు మళ్లించేందుకు మోదీ యత్నిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు యుద్ధం చేయాలని, బీఆర్ఎస్​ ఎంపీలు గెలిస్తేనే అది పాజిబుల్ అవుతదన్నారు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీ ఎదుట చేతులు కట్టుకొని నిలబడటం తప్పితే ఏమీ చేయలేరని అన్నారు.  

తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే 

రాష్ట్రానికి మోదీ అడుగడుగునా అన్యాయమే చేశారని, ఆయనను ప్రశ్నించినందుకే తన కూతురిని జైల్లో పెట్టారని కేసీఆర్​ మండిపడ్డారు.  ప్రతి జిల్లాకు ఒక నవోదయ స్కూల్​ ఇవ్వాలని తాను సీఎంగా ఉన్నప్పుడు పర్సనల్​గా కలిసినా..150 లెటర్లు రాసినా మోదీ స్పందించలేదని చెప్పారు. దేశంలో157 మెడికల్​ కాలేజీలు ఏర్పాటు చేసి, తెలంగాణకు మొండి చెయ్యి చూపారన్నారు. తెలంగాణ ప్రజలంటే మోదీకి ఎందుకంత ద్వేషమని ప్రశ్నించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని,  20% ఉన్న మైనారిటీ ఓటర్లు తప్పుడు నిర్ణయం తీసుకుంటే బీజేపీకి లాభమైతదని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  

ప్రజల కోసం కొట్లాట ఆపను 

కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మడంతో అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోయామని కేసీఆర్​ పేర్కొన్నారు. అయినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడడం ఆపబోనని చెప్పారు.  ఆరు గ్యారంటీలను పక్కనబెట్టిండని, తాను  బస్సు యాత్ర షురూ చేయగానే బంద్​ చేసిన రైతుబంధు పైసలు రిలీజ్ ​చేసిండని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్​ మెడలు వంచుతానని అన్నారు. కాలిరిగి కట్టే చేతిలోకి వచ్చినా పోరాడుతూనే ఉంటానని చెప్పారు.  ‘‘నేను చేసిన రైతు రుణ మాఫీని రేవంత్​ ఎక్కిరించిండు. డిసెంబర్​ 9న రూ.2 లక్షల మాఫీ చేస్తానన్నడు. ఇప్పుడా సొమ్మును కక్కించేదాకా వదల’’ అని కేసీఆర్​ పేర్కొన్నారు. ఆడబిడ్డల పెండ్లికి ఇస్తానన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. 

గుండా ఎంపీని ఓడించాలె

నిజామాబాద్​లో గూండా ఎంపీ (ధర్మపురి అర్వింద్​)ని ఓడించాలని కేసీఆర్​ ప్రజలకు పిలుపునిచ్చారు. అర్వింద్​ను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్​కు ఏకాణ లాభం జరుగలేదన్నారు. ఆయన నోరుతెరిస్తే అంతా గందరగోళమే అని ఎద్దేవా చేశారు. తాను గులాబీ జెండా పట్టుకొని ఉద్యమించిన నాడు నిజామాబాద్​ ప్రజలు అండగా ఉన్నారని, జడ్పీ పీఠాన్ని అందించి  ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన తీరు చచ్చేదాకా మరువబోనని చెప్పారు.  ఈసారి కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్​ గవర్నమెంట్​లు రావని, ప్రాంతీయ శక్తుల కూటమితో  సర్కారు ఏర్పడుతుందని అన్నారు. తాము బలమైన శక్తిగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామన్నారు.