నేడు భారత్ కు రష్యా అధ్యక్షుడు  పుతిన్

నేడు భారత్ కు రష్యా అధ్యక్షుడు  పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్  పుతిన్  ఇవాళ భారత పర్యటనకు వస్తున్నారు. రెండు దేశాల మధ్య జరిగే వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు 20 సమావేశాలు జరిగాయి. ఇప్పుడు 21వ సమావేశంలో పుతిన్,  మోడీ భేటీ కాబోతున్నారు. గతంలో 2018 అక్టోబర్  లో పుతిన్, మోదీ మధ్య చర్చలు జరిగాయి. 

2018 నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయంగా చాలా మార్పులు జరిగాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబాన్లకు రష్యా సపోర్ట్ ఇవ్వడం వివాదాస్పదమైంది. దీన్ని పాకిస్తాన్ తమకు అనుకూలంగా మలచుకుంటోంది. మరోవైపు భారత్  పై కయ్యానికి చైనా కాలు దువ్వుతూ సరిహద్దులో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఇప్పటికే అమెరికాను ఎదుర్కోవడానికి రష్యా, చైనా చేతులు కలిపాయి. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను కూడా కలిశారు పుతిన్. ఇప్పుడు భారతపర్యటనకు వస్తున్నారు. కాబట్టి.. ఈ మూడేళ్లలో జరిగిన అనేక రాజకీయ, ద్వైపాక్షిక అంశాలపై ఈ భేటీలో చర్చించే ఛాన్సుంది. 

భారత్-రష్యా మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలున్నాయి. కానీ కొద్ది రోజులుగా అమెరికాతో స్నేహంగా ఉంటున్న రష్యా.. ఇతర దేశాలతో కాస్త డిస్టెన్స్ పాటిస్తోంది. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు చేతులు కలిపి క్వాడ్  కూటమిని ఏర్పాటు చేసి దక్షిణ సముద్రంపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్వాడ్  కూటమిపై రష్యా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా, చైనా ఆధిపత్య పోరులో రష్యా, భారత్  చెరోవైపు ఉన్నాయి. ఇక ఆయుధాల కొనుగోలులో భారత్  ఎప్పుడూ రష్యాపైనే ఆధారపడుతుంది. ఈ మధ్య కాలంలో అమెరికాను కూడా ఆశ్రయిస్తోంది. ఈ విషయాలన్నింటిపైనా  పుతిన్, మోదీ  చర్చించే అవకాశం ఉంది.