ముంబై: టెస్టు మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదనను ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయంతో టెస్ట్ క్రికెట్‌కు నష్టమే తప్ప లాభం ఉండదని స్పష్టం చేశారు. ఫోర్ డే టెస్ట్‌ల వల్ల స్పిన్నర్లకు ఉన్న ఒకే ఒక్క అవకాశాన్ని దూరం చేసినట్టవుతుందని బ్యాటింగ్ లెజెండ్ సచిన్ అభిప్రాయపడ్డాడు. ‘పాత బంతితో స్పిన్నర్లు ఐదో రోజు అడ్వాంటేజ్ పొందుతారు. ఇది టెస్ట్ క్రికెట్‌లో భాగం. ఇప్పుడు దానిని కూడా దూరం చేయడం సబబేనా? క్రికెట్‌లో టీ20, వన్డే, టీ10,100 బాల్ ఫార్మాట్‌లు ఉన్నాయి. కానీ టెస్ట్ క్రికెట్ స్వచ్ఛమైనది. దీన్ని కుదించాల్సిన అవసరం లేదు. ఇలాంటి నిర్ణయాలను పక్కనబెట్టి ఆటకు కావాల్సిన నాణ్యమైన వనరులు అందించడంపై ఐసీసీ దృష్టిసారించాలి. ఒకే పిచ్‌పై బంతి స్పిన్, సీమ్, స్వింగ్, బౌన్స్ అవ్వాలి. అప్పుడు ఆట సజీవంగా ఉండటంతో పాటు మంచి ఫలితాలు వస్తాయి’ అని సచిన్ సూచించాడు. ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ కూడా ఫోర్ డే టెస్ట్‌లపై విముఖత చూపాడు. దీనివల్ల మరిన్ని మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగుస్తాయని చెప్పాడు.

