SBI ఖాతాదారులకు అలర్ట్! బ్యాంక్ సర్వర్ డేటా లీక్

SBI ఖాతాదారులకు అలర్ట్! బ్యాంక్ సర్వర్ డేటా లీక్

 ముంబై: SBI ఖాతాదారులు వెంటనే అలర్ట్ అవ్వాల్సిన వార్త ఇది. వెంటనే నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డుల పాస్ వర్డ్, పిన్ నంబర్లను మార్చేసుకోవడం మేలు. అంత అర్జంట్ ఏంటీ అనుకోకండి.. లక్షల మంది అకౌంట్ నంబర్లు, బ్యాలెన్స్, ఫోన్ నంబర్లు వంటి వివరాలు స్టోర్ అయి ఉన్న ఎస్బీఐ సర్వర్ డేటా లీక్ అయింది. టెక్ క్రంచ్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

ముంబైలోని సర్వర్ దాదాపు రెండు నెలల పాటు ఎటువంటి పాస్ వర్డ్ సెక్యూరిటీ లేకుండా వదిలేయడంతో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని యాక్సిస్ చేశారు. కాన్ఫిడెన్షియల్ డేటా అంతా లీక్ అయినట్లు టెక్ క్రంచ్ చెబుతోంది. మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాంకు బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ వంటి వివరాలను వెల్లడించే ‘ఎస్బీఐ క్విక్’ సర్వర్ నుంచి ఈ డేటా లీక్ జరిగిందని చెప్పింది. బ్యాంకు తమ కస్టమర్లకు పంపే మెసేజెస్ కూడా లీక్ అయ్యాయని తెలిపింది. సోమవారం ఒక్క రోజే బ్యాంకు 30 లక్షల మందికి మెసేజెస్ పంపిందన్నారు. తాము కూడా సర్వర్ ను యాక్సిస్ చేశామని, అయితే ప్రస్తుతం సర్వర్ సేఫ్ గానే ఉందని టెక్ క్రంచ్ వివరించింది.

అయితే ఇప్పటికే లీక్ అయిన డేటా ఆధారంగా భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లను టార్గెట్ చేసి దోచేసుకునే అవకాశం ఉందని టెక్నికల్ రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. వెంటనే ఎస్బీఐ అకౌంట్ హోల్డర్లు తమ పాస్ వర్డ్స్ మార్చుకోవడం మేలని చెబుతున్నారు. అయితే ఎస్బీఐ క్విక్ కు ఎప్పుడూ కాల్ చేయని కస్టమర్ల డేటా సేఫ్ గానే ఉంటుందన్నారు.