కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి ఖరారు

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి ఖరారు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి ఖరారైంది. ఆదివారం నిర్వహించిన కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ, జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌ కమిటీ సమావేశాల్లో ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. కృష్ణా బోర్డు ఆధీనంలోకి కామన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుల హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్లు వెళ్లనున్నాయి. తుంగభద్ర బోర్డు స్వాధీనంలో ఉన్న సుంకేసుల, ఆర్డీఎస్‌‌‌‌‌‌‌‌ కూడా కృష్ణా బోర్డు కిందికి రానున్నాయి. హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్లు మినహా వాటి కింద ఉన్న ప్రధాన కాల్వలు, ఇతర ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లు ఇవ్వడానికి రెండు రాష్ట్రాలు ససేమిరా అన్నాయి. గోదావరి బోర్డు కిందికి కామన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగు ఒక్కటే వెళ్లనుంది. హైడల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు ఇచ్చేందుకు తెలంగాణ ససేమిరా అంది. కామన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు మినహా మరే ప్రాజెక్టు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. సోమవారం నిర్వహించే జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ, మంగళవారం నిర్వహించే కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ ఫుల్‌‌‌‌‌‌‌‌ బోర్డు మీటింగుల్లో వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

మీటింగుల్లో ఏం జరిగిందంటే..!

హైదరాబాద్​లోని జలసౌధలో ఆదివారం ఉదయం జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ మెంబర్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ బీపీ పాండే అధ్యక్షతన గోదావరి బోర్డు సబ్‌‌‌‌‌‌‌‌ కమిటీ, మధ్యాహ్నం కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ మెంబర్‌‌‌‌‌‌‌‌ రవికుమార్‌‌‌‌‌‌‌‌ పిళ్లై అధ్యక్షతన కృష్ణా బోర్డు సబ్‌‌‌‌‌‌‌‌ కమిటీ సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ నుంచి ఇంటర్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌ సీఈ మోహన్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌,  ఏపీ నుంచి ఇంటర్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌ సీఈ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇతర ఇంజనీర్లు సమావేశాలకు హాజరయ్యారు. గోదావరిపై తెలంగాణ నిర్మించిన అన్ని ప్రాజెక్టులను బోర్డు నిర్వహణలోకి తీసుకోవాలని ఏపీ సీఈ కోరారు. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. జల వివాదాలు లేని గోదావరి ప్రాజెక్టులు బోర్డు ఆధీనంలోకి ఎందుకని ప్రశ్నించారు. ఏపీలోని ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులతో పాటు పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తీసుకురావాలన్నారు. దీనికి ఏపీ అబ్జక్షన్‌‌‌‌‌‌‌‌ చెప్పింది. గోదావరిపై కామన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగు ఇవ్వడానికి రెండు రాష్ట్రాల సీఈలు అంగీకారం తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ఆయకట్టు 85 శాతం ఏపీలో, 15 శాతం తెలంగాణలో ఉండటంతో నిర్వహణ వ్యయాన్ని అదే నిష్పత్తిలో పంచుకోవాలని నిర్ణయించారు. ఉద్యోగుల జీతాలను రెండు రాష్ట్రాలు చెరిసగం భరించేందుకు ఒప్పుకున్నారు. కృష్ణాపై జూరాల ప్రాజెక్టు, దానిపై లిఫ్టులు బోర్డుకు ఇవ్వడానికి తెలంగాణ ససేమిరా అంది. కేవలం ప్రధాన రెగ్యులేటర్లు మాత్రమే నిర్వహణకు అప్పగిస్తామని, కాల్వలు, ఇతర ఔట్‌‌‌‌‌‌‌‌ లెట్లు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ దిగువన ఉన్న బనకచర్ల క్రాస్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌తో పాటు కృష్ణా డెల్టా సిస్టం బోర్డుకు ఇచ్చేది లేదని ఏపీ తేల్చిచెప్పింది.

సెకండ్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో మిగతా ప్రాజెక్టులు

ఈనెల 14 నుంచి గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ అమలు చేయాల్సి ఉండటంతో మొదట కామన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులతో మొదలు పెట్టాలని కృష్ణా, గోదావరి బోర్డులు నిర్ణయానికి వచ్చాయి. కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే ఈ దిశగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే వివాదాలు లేని ప్రధాన ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని రెండు బోర్డులు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆయా ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కొరత అడ్డంకిగా ఉండటంతో ఫుల్‌‌‌‌‌‌‌‌ బోర్డు మీటింగుల్లో సీడ్‌‌‌‌‌‌‌‌ మనీ విడుదల చేయాలని రెండు రాష్ట్రాలపై ఒత్తిడి చేయనున్నాయి. ఇప్పటికే పలుమార్లు రెండు రాష్ట్రాలకు బోర్డులు లెటర్లు రాశాయి. ఫుల్‌‌‌‌‌‌‌‌ బోర్డుల సమావేశాల్లో కామన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుల నిర్వహణ తేలాక, సెకండ్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో మిగతా ప్రాజెక్టులపై చర్చించాలని సబ్‌‌‌‌‌‌‌‌ కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.

కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్లేవి..

  • శ్రీశైలం ప్రాజెక్టు కింద ఏపీకి నీళ్లు ఇచ్చే పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌, హంద్రీనీవా, ముచ్చుమర్రి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లు, తెలంగాణ భూ భాగంలోని కల్వకుర్తి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ వెళ్లనున్నాయి. దీనితోపాటు శ్రీశైలం స్పిల్‌‌‌‌‌‌‌‌ వే కూడా బోర్డు నిర్వహించనుంది.
  • నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌  కింద ఏపీకి నీళ్లు ఇచ్చే రైట్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌, సాగర్‌‌‌‌‌‌‌‌ టెయిల్‌‌‌‌‌‌‌‌పాండ్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ వర్క్స్‌‌‌‌‌‌‌‌, సాగర్‌‌‌‌‌‌‌‌ స్పిల్‌‌‌‌‌‌‌‌ వే వెళ్లనున్నాయి. 
  • నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ నుంచి తెలంగాణకు నీళ్లు వచ్చే ఎడమ కాలువ హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌.. ఏఎమ్మార్పీ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌, వరద కాలువ వెళ్లనున్నాయి.
  • పులిచింతల హెడ్‌‌‌‌‌‌‌‌ వర్క్స్‌‌‌‌‌‌‌‌, తుంగభద్ర బోర్డు ఆధీనంలో ఉన్న ఆర్డీఎస్‌‌‌‌‌‌‌‌ (తెలంగాణ), సుంకేసుల బ్యారేజీ (ఏపీ) కింద కాల్వలు కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ నిర్వహణలోకి వెళ్లనున్నాయి.