అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్!

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్!
  • రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు 
  • సభ్యులుగా వీసీలు, ఉన్నత విద్యామండలి అధికారులు
  • గతంలో అక్రమాలు జరగడంతో ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను స్క్రీనింగ్ టెస్టు, ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ పోస్టులను భర్తీ చేయగా... త్వరలో భర్తీ చేయనున్న 1,195 పోస్టులకు తప్పనిసరిగా రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరగడం, కొందరు వీసీలు మెరిట్ ఉన్నోళ్లను కాదని తమకు కావాల్సినోళ్లను ఇంటర్వ్యూల్లో ఎంపిక చేశారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదే విధంగా గత అనుభవాల నేపథ్యంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియను కేవలం వర్సిటీ వీసీల చేతుల్లోనే పెట్టొద్దని నిర్ణయించినట్టు సమాచారం. రిక్రూట్మెంట్ పారదర్శకంగా జరిగేందుకు వీసీలు, ఉన్నత విద్యామండలి అధికారులు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లు సభ్యులుగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనుంది. బీహార్ లో ప్రస్తుతం ఇదే పద్ధతిని అనుసరిస్తుండడంతో, దాన్ని ఇక్కడా అమలు చేయాలని నిర్ణయించింది.

రెండు వర్సిటీల్లో అక్రమాలు...

కాకతీయ యూనివర్సిటీలో 2009, 2013లో జరిగిన రిక్రూట్ మెంట్ లో, మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరిగిన రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూశాయి. మహాత్మాగాంధీ వర్సిటీ వ్యవహారంపై రిటైర్డ్ వీసీ సులేమాన్ సిద్ధిఖీ నేతృత్వంలో విచారణ కమిటీ వేయగా.. అక్రమాలు నిజమేనని తేల్చింది. ఈ రిక్రూట్ మెంట్లపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ కేసులు నమోదయ్యాయి. కాకతీయ వర్సిటీలో 32 మంది, మహాత్మాగాంధీ వర్సిటీలో 32 మంది నియామకాలు చెల్లవని కోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఆయా వర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లలోనూ సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగించాలని తీర్మానాలు చేశారు. ప్రస్తుతం వీరి తొలగింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమే మిగిలి ఉంది.

యూనివర్సిటీల వారీగా టీచింగ్ పోస్టుల ఖాళీలివీ... 

ఉస్మానియా                              433

కాకతీయ                                   159 

జేఎన్టీయూ(హైదరాబాద్)       209

ఆర్జీయూకేటీ(బాసర)               102

తెలంగాణ                                  68

పాలమూరు                                64

శాతవాహన                                 47

జేఎన్టీయూ(ఫైన్ ఆర్ట్స్)            41

మహాత్మాగాంధీ                         36

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ      23

తెలుగు యూనివర్సిటీ             13