ఎండ తీవ్రతకు నిప్పుల కొలిమిలా తెలంగాణ..12జిల్లాలకు రెడ్ అలర్ట్

ఎండ తీవ్రతకు నిప్పుల కొలిమిలా తెలంగాణ..12జిల్లాలకు రెడ్ అలర్ట్

ఎండతీవ్రతకు తెలంగాణ నిప్పుల కొలిమిలా మారుతోంది. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.  ఉదయం 10 గంటలకే ఇంటినుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రానున్న 4 రోజులు ఎండతీవ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఉందని తెలిపింది.  వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడిగాలుల నుంచి తట్టుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఎండల తీవ్రతకు ఏసీలు, కూలర్లు పనిచేయడం లేదు. దీంతో ఇండ్లు, వ్యాపార సముదాయాల ముందు పచ్చని పరదాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు తమ బైక్​లను కాపాడుకునేందుకు గోనె సంచులు, బెడ్ షీట్లు  కప్పుతున్నారు. చికెన్  వ్యాపారులు గంటకోసారి బాయిలర్  కోళ్లకు నీళ్లు చల్లుతూ ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు.