మోదీతో శరద్ పవార్, సుప్రియా సూలే భేటీ

మోదీతో శరద్ పవార్, సుప్రియా సూలే భేటీ
  • ఎన్డీయేలో ఎన్సీపీ చేరుతున్నట్లు ఊహాగానాలు

న్యూఢిల్లీ: ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ప్రధాని స్వయంగా పవార్‌‌ను తన ఆఫీసులోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలు, నీటిపారుదల అంశాలపై ఓ వినతిపత్రాన్ని ప్రధానికి పవార్ అందజేశారు. భేటీకి సంబంధించిన ఫొటోల్లో మోదీ, పవార్ నవ్వుతూ మాట్లాడటం కనిపించింది.

దాంతో శరద్ పవార్ వర్గం అధికార ఎన్డీయే కూటమిలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. మహారాష్ట్రలో ఎన్సీపీకి చెందిన రెండు ప్రత్యర్థి వర్గాల నేతలు ఇటీవల తరచూ సమావేశమవుతుండటంతో అక్కడ రాజకీయ పునరేకీకరణ జరుగుతుందనే ప్రచారం బలపడింది. అయితే, శరద్ పవార్‌‌ను గానీ, ఆయన అనుచరులను గానీ వ్యక్తిగతంగా కూటమిలోకి తీసుకోవడానికి తమకు ఆసక్తి లేదని బీజేపీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

శరద్ పవార్ వర్గం ఎన్డీయేలో అధికారికంగా చేరాలంటే ఎన్సీపీలోని రెండు వర్గాలు ముందుగా తమ విభేదాలను మరచిపోయి విలీనం కావాలని బీజేపీ షరతు విధించింది. అలా విలీనం అయిన తర్వాతే ఎన్సీపీతో పొత్తును పరిశీలిస్తామని స్పష్టం చేసింది.