న్యూఢిల్లీ: ఇండియా బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ జ్వాల గుత్తా.. ‘అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో ఓ అకాడమీని లాంచ్ చేసింది. గచ్చిబౌలిలోని ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసే ఈ అకాడమీ వచ్చే నెల నుంచి మొదలవుతుంది. సకల సౌకర్యాలతో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్లుగా శిక్షణ ఉంటుందని జ్వాల వెల్లడించింది. క్రికెట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్‌తో పాటు ఇతర క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 55 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ అకాడమీలో 14 కోర్టులు నిర్మిస్తున్నారు. 600 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇద్దరు విదేశీ, పది మంది స్వదేశీ కోచ్‌లు పని చేయనున్నారు. బ్యాడ్మింటన్ మాజీ కోచ్ ఎస్‌ఎమ్ ఆరిఫ్ ఆధ్వర్యంలో కోచ్‌లను ఫైనలైజ్ చేయనున్నారు. ఈ అకాడమీకి సాయం చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖను సంప్రదించానని జ్వాల చెప్పింది. కోచ్‌ల కోసం ఆరు నెలల డిప్లమా కోర్సును ప్రవేశ పెడుతున్నామంది. తనకు కోచింగ్‌లో అనుభవం లేనందున కేవలం మెంటార్‌గా వ్యవహరిస్తానంది. కోచ్, ప్లేయర్, పేరెంట్స్‌కు మధ్య వారధిగా పని చేస్తానని వెల్లడించింది. డబుల్స్‌లో తనకు జోడీగా ఆడేందుకు సరిపోయే క్రీడాకారులు ఎవరూ లేరని జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది.


