Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా సిన్నర్.. ఫైనల్లో మెద్వెదేవ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ

Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా సిన్నర్.. ఫైనల్లో మెద్వెదేవ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఇటలీ యంగ్ ప్లేయర్ జనిక్ సిన్నర్ గెలుచుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో రష్యా ప్లేయర్ డేనియల్ మెద్వెదేవ్‌ను ఓడించి కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకున్నాడు. తొలిసారి ఒక గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరిన ఈ ఇటలీ కుర్రాడు ఐదు సెట్ల పాటు జరిగిన ఈ  థ్రిల్లర్‌లో  3-6, 3-6, 6-4, 6-4, 6-3 తో మెద్వెదేవ్‌ కు ఊహించని షాక్ ఇచ్చాడు. 3 గంటల 44 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సిన్నర్ విజేతగా నిలిచాడు.    

22 ఏళ్ళ సిన్నర్ తొలి రెండు సెట్ లు ఓడిపోయినా.. ఆ తర్వాత పుంజుకున్న విధానం అద్భుతం. ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా చివరి మూడు సెట్లలో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెమీ ఫైనల్లో జొకోవిచ్ ఆట కట్టించిన సిన్నర్ కు  ఫైనల్లో మెద్వెదేవ్‌ రూపంలో గట్టి పోటీ ఏర్పడింది. అయితే కీలక సమయంలో పుంజుకొని ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఈ విజయంతో సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి ఇటాలియన్‌గా చరిత్ర సృష్టించాడు.
 
మరోవైపు రన్నరప్ డేనియల్ మెద్వెదేవ్‌ కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవాలన్న కల ఇంకా అలాగే ఉండిపోయింది. గతంలో జొకోవిచ్, నాదల్ చేతిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఓడిన ఈ రష్యా ప్లేయర్.. తాజాగా సిన్నర్ చేతిలో పరాజయం పాలయ్యాడు.