ఒంటికాలితో 2 కిలోమీటర్లు నడుస్తూ బడికి

ఒంటికాలితో 2 కిలోమీటర్లు నడుస్తూ బడికి

ఆ దివ్యాంగ విద్యార్థిని ఆత్మస్థైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఒంటికాలితో రోజూ 2 కిలోమీటర్లు కుంటుతూ.. ఆమె  బడికి వెళ్లొస్తోంది. చదువుపై ఉన్న ఇష్టమే ప్రేరణగా మారి.. బిహార్ లోని సివాన్ జిల్లా జముయి పట్టణానికి చెందిన ప్రియాంశు కుమారిని బడి దాకా నడిపిస్తోంది. కృత్రిమ కాలు లేదు.. అనే విషయాన్ని పట్టించుకోకుండా చిన్నప్పటి నుంచి స్కూల్ కు వెళ్లొస్తోంది.

‘‘నాకు చదువంటే ప్రాణం.. డాక్టర్ కావాలనేది జీవిత లక్ష్యం. నా కలలను చంపుకోలేను. ప్రభుత్వం స్పందించి కృత్రిమ కాలును అందించి నన్ను ఆదుకోవాలి. జీవిత ఆశయాలకు ఊపిరి పోయాలి’’ అని  ప్రియాంశు విజ్ఞప్తి చేస్తోంది. ఆమె తల్లిదండ్రులు సన్నకారు రైతులు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో తమ కూతురికి కృత్రిమ కాలును కొనిచ్చే స్థోమత వారికి లేదు. ఆమె కాలినడకన బడికి వెళ్తున్న వీడియోను ఏఎన్ఐ వార్తాసంస్థ ట్విటర్ లో షేర్ చేసింది. దీనిపై నెటిజన్స్ విశేషంగా స్పందించారు. అవసరమైతే తామే ఆర్థికసాయం చేస్తామంటూ కొందరు కామెంట్స్ పెట్టారు.