సోషల్​మీడియా తెచ్చిన రెవల్యూషన్​ ఇలా ఉంది..

సోషల్​మీడియా తెచ్చిన రెవల్యూషన్​ ఇలా ఉంది..

ఒకప్పుడు  పొద్దున్నే న్యూస్​పేపర్ చదవందే ఏమీ తోచేది కాదు చాలామందికి. ఊర్లలో అనుకోండి... పొద్దుగూకితే చాలు నలుగురు ఒకచోట చేరి, ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవాళ్లు. అయితే, టీవీలు వచ్చినంక ఎవరి ఇండ్లలో వాళ్లు ఉండటం మొదలైంది. స్మార్ట్​ఫోన్​ వచ్చిన తర్వాత  ఎవరి ఫోన్లలో వాళ్లు అన్నట్టు ఉంది పరిస్థితి. అలాగని, ఈ జనరేషన్​వాళ్లు నలుగురిలో కలవట్లేదు, ఏ విషయంపైనా నోరు తెరవట్లేదు అనుకోవద్దు. ఏ సబ్జెక్ట్​ మీదనైనా ఓపెన్​గా మాట్లాడుతున్నారు. సిటీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా   ఫ్రెండ్స్​, ఫ్యామిలీతో అన్ని విషయాలు షేర్​ చేసుకుంటున్నారు. సోషల్​మీడియా తెచ్చిన రెవల్యూషన్​ ఇది. టాలెంట్​ ఉంటే చాలు సామాన్యులు సైతం సెలబ్రిటీలు అవుతారు. తేడాగా ఉంటే తెలివైనవాళ్లని కూడా తాలు గింజల్ని చేస్తుంది. మరి అలాంటి ఈ ఆన్​లైన్​ వరల్డ్ ఇప్పుడెలా ఉందంటే...


ఈరోజుల్లో స్మార్ట్​ఫోన్ లేనివాళ్లు... ​అందులో ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​, ట్విట్టర్​ వంటి సోషల్​మీడియా యాప్స్​ లేనివాళ్లు చాలా తక్కువ. పొద్దున లేవగానే ఫోన్​ అందుకుని వాట్సాప్​ స్టేటస్, ఇన్​స్టా స్టోరీలు చూడకుంటే ఏం తోచదు కొందరికి. ఫేస్​బుక్​ మెసెంజర్​, ట్విట్టర్​ ట్రెండ్స్​ చూస్తే గానీ మరికొందరికి మనసు నిమ్మలం కాదు. సోషల్​మీడియా యాప్స్​ వాడడం అనేది ఇప్పుడు రోజూ చేయాల్సిన పనుల్లో ఒకటి అయింది.  

సోషల్​మీడియా అనేది డిజిటల్ రెవల్యూషన్​కి పర్ఫెక్ట్​ ఎగ్జాంపుల్​. ప్రపంచాన్ని ఒక్కటి చేసే వేదిక మాత్రమే కాదు ప్రపంచాన్ని కళ్ల ముందుంచే మీడియా కూడా. కామన్​ మ్యాన్​ నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడంతా సోషల్​మీడియా ట్రెండ్స్​ని ఫాలో అవుతున్నారు. మారుమూల ఊర్లో ఉన్నా సరే... స్మార్ట్​ఫోన్​ సాయంతో దునియాలో ఎక్కడ, ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఏ విషయం మీదైనా ఒపీనియన్​ చెప్పొచ్చు. సోషల్​మీడియా వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడం, కమ్యూనికేట్ చేయడం ఈజీ అయింది. సోషల్​మీడియాలో ఏయే విషయాలు మాట్లాడతారంటే... పానీ పూరీ నుంచి పాలిటిక్స్ దాకా, సినిమా న్యూస్​ నుంచి సోషల్​ ఇష్యూస్​ వరకు, క్యాంపస్​ ఇంటర్వ్యూల నుంచి కాంపిటీటివ్​ ఎగ్జామ్స్​ వరకు... ఇలా  దేని గురించైనా ఓపెన్​గా మాట్లాడుకుంటున్నారు. ఏ విషయమైనా నచ్చితే చాలు కామెంట్, లైక్స్, షేరింగ్​, రీ–పోస్టింగ్ చేస్తున్నారు. అంతేనా... ఆపదలో ఉన్నవాళ్లకి ‘మేమున్నా’మంటూ భరోసానివ్వడమే కాదు క్రౌడ్​ఫండింగ్​ ద్వారా  సాయం చేస్తున్నారు కూడా. 
అందుకే అంత ఫేమస్​
ఇంతకుముందు ఛాయ్​బండ్లు, కాఫీ డేలు, కాలేజీ క్యాంటిన్ల దగ్గర డిస్కషన్​ పెట్టేవాళ్లు. కానీ, ఇప్పుడు ఆ ప్లేస్​ సోషల్​మీడియాది. డిస్కషన్స్​, డిబేట్స్​, క్యాంపెయినింగ్​, బ్రాండ్ ప్రమోషన్​​... ఇలా అన్నింటికి కేరాఫ్​ అయింది సోషల్​ మీడియా. అంతేకాదు ఒకేరకమైన ఆలోచన ఉన్నవాళ్లని ఒక్కటి చేసే చౌరస్తా  కూడా.ఈ యాప్స్​ సాయంతో యూజర్లు తమ ఫేవరెట్​ పొలిటీషియన్, సెలబ్రిటీ, ఆటగాళ్లని ఫాలో అవుతున్నారు. ఇంటర్నెట్​ ఫెసిలిటీ ఉంటే చాలు... ఒక్క ఫొటో, పోస్ట్​తో ఊర్లో లేదా కాలనీలోని సమస్య గురించి నేరుగా మినిస్టర్స్, ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. అంతేకాదు ఫేస్​బుక్ ద్వారా చిన్నప్పటి ఫ్రెండ్స్​ని కలుసుకున్నవాళ్లు, తప్పిపోయిన కుటుంబసభ్యుల్ని కలిసినవాళ్లు ఉన్నారు.  
అందుకే ఎక్కువగా వాడుతున్నారు
సోషల్​మీడియాలో చాలామంది పర్సనల్​ ఇన్ఫర్మేషన్​ పోస్ట్​ చేస్తుంటారు. దీనిపై న్యూయార్క్​ టైమ్స్​ కన్జూమర్​ ఇన్​సైట్​ గ్రూప్​ ఏం చెప్పిందంటే...  నలుగురికి ఉపయోగపడే, ఎంటర్​టైన్​​ చేసే కంటెంట్​ని అందరితో పంచుకోవడం కోసం, తమని కొత్తగా చూసుకునేందుకు, ఫ్రెండ్​ సర్కిల్ పెంచుకునేందుకు, కొత్త పరిచయాలు చేసుకునేందుకు... తమకు నచ్చిన వాళ్లని సపోర్ట్​ చేసేందుకు... ఇలా సోషల్​మీడియాని  ఒక్కొక్కరు ఒక్కోలా వాడతారు.  
న్యూస్​ సోర్స్​ అవుతోంది
మొదట్లో ఎంటర్​టైన్​మెంట్​ ఫీచర్లతో ఉన్న ఫేస్​బుక్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్​కి సోర్స్​ అవుతోంది. ట్విట్టర్​కూడా న్యూస్​ సోర్స్​గా అవతరించింది. ముఖ్యంగా సెలబ్రిటీలు, బిజినెస్​మెన్​, పొలిటీషియన్స్​   ట్విట్టర్​ ద్వారా చాలా విషయాలు షేర్​ చేసుకుంటున్నారు. వాళ్లు అలా ట్వీట్​ చేశారో, లేదో.... నిమిషాల్లోనే వాళ్ల ట్వీట్స్​పై డిస్కషన్స్ పెడుతున్నారు యూజర్లు. కొందరు సెలబ్రిటీలు  ఇన్​స్టాగ్రామ్​లో తమ ఫిట్​నెస్​ రొటీన్​ని ఫ్యాన్స్​తో పంచుకుంటున్నారు. ఈమధ్య సోషల్​మీడియాలో కొన్నిసార్లు ఫేక్​ న్యూస్​ చాలా తొందరగా వ్యాపిస్తోంది. అలాంటి వార్తలు జనాల్లో నెగెటివిటీని పెంచుతున్నాయి.   
సోషల్​ రెస్పాన్స్​లో ఫస్ట్
సోషల్​ మీడియా చాలామందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. లాక్​డౌన్​ టైమ్​లో అయితే ఎంతోమంది బతుకు కష్టాల్ని తీర్చింది. అంతేకాదు అవసరంలో ఉన్నవాళ్లకి ఎవరి సాయం అందకుంటే.... చివరి ప్రయత్నంగా సోషల్​మీడియా వైపు చూస్తారు.  చుట్టపు చూపు కూడా నోచుకోనివాళ్లకు  సోషల్​మీడియా యజర్లు డబ్బు సాయం చేసి, ఆత్మీయుల్లా ఆదుకుంటారు. చాలావరకు సోషల్​మీడియా పేజీలు  అవసరంలో ఉన్నవాళ్లకి ఆసరాగా నిలుస్తున్నాయి. ‘హ్యూమన్స్ ఆఫ్​ బాంబే’ ఫేస్​బుక్​ పేజీ, ఎన్జీవోలు కష్టాల్ని దాటి జీవితాన్ని గెలిచిన వాళ్ల స్టోరీ అందరికీ తెలిసేలా తమ ఫేస్​బుక్​ పేజీల్లో పెడుతున్నాయి. సోషల్​మీడియాతో వెలుగులోకి వచ్చిన కొందరి స్టోరీలివి...
బాబా కా దాబా... ఢిల్లీకి చెందిన కంటా ప్రసాద్​కి ఎనభై ఏండ్లు. భార్య బదామి దేవితో కలిసి చిన్న దుకాణం నడిపేవాడు. లాక్​డౌన్​లో కస్టమర్లు రాకపోవడంతో, గిరాకీ లేదు. దాంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న అతని వీడియోని యూట్యూబర్​ గౌరవ్ వాసన్ సోషల్​మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసి చలించిపోయారంతా. వాళ్లకి అండగా ఉంటామంటూ ముందుకొచ్చారు చాలామంది. ఆ తెల్లారి నుంచి బాబా కా దాబాకి వచ్చేవాళ్ల సంఖ్య పెరిగింది.  
బిచ్చగత్తె టు సింగర్​...  రైల్వే ప్లాట్​ఫామ్​ మీద  పాటలు పాడుతూ బిచ్చమెత్తుకునేది రణ్​మండోల్​. ఆమె ఒకప్పుడు ముంబై బార్లలో పాటలు పాడేది. భర్త చనిపోయాక ఆమె జీవితం మారిపోయింది. బతకడం కోసం రైల్వేస్టేషన్లలో బిచ్చమెత్తడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆమె ‘ఏక్​ ప్యార్​ కా నగ్మా హై’ పాట పాడుతుంటే అతీంద్ర చక్రవర్తి అనే ఇంజనీర్​ వీడియో తీసి సోషల్‌‌మీడియాలో పెట్టాడు.  అచ్చం లతా మంగేష్కర్​లా ఉన్న పాడుతున్న ఆమె వీడియో వైరల్​ అయింది. ఆమె టాలెంట్​ని చూసి హిమేశ్​ రేష్మియా తన సినిమాలో పాటపాడే ఛాన్స్​ ఇచ్చాడు.  
ఐరన్​ మ్యాన్​ సూట్​ చేసి...

మణిపూర్​కి చెందిన ప్రేమ్​ నింగోంబమ్​  మెటల్​ వేస్ట్​తో ఐరన్​ మ్యాన్ సూట్​ తయారుచేశాడు. ఆ వీడియో సోషల్​ మీడియాలో చూశాడు ఆనంద మహీంద్రా. పేదకుటుంబానికి చెందిన ఆ అబ్బాయి టాలెంట్​ చూసి, అతనికి డబ్బు సాయం చేయాలి అనుకున్నాడాయన. హైదరాబాద్​లోని మహీంద్రా యూనివర్సిటీలో ప్రేమ్​కి ఫ్రీగా ఇంజనీరింగ్​ చదువుకునే అవకాశం​ ఇచ్చారు. ఇప్పుడు ప్రేమ్​ కలలకి రెక్కలొచ్చాయి. 
పల్లీలు అమ్ముతూ ఫేమస్​ 
టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో స్టెప్పులు వేయిస్తోంది ఈ పాట.  అలాగని ఈ పాట పాడింది ఫేమస్​ సింగర్​ కాదు. బెంగాల్​లో​ బండి మీద తిరుగుతూ పల్లీలు అమ్మే భువన్ బద్యాకర్ పాడిండు. గిరాకీ తగ్గిపోవడంతో పాట పాడుతూ పల్లీలు అమ్మాలని అనుకున్నాడు.  బెంగాలీలో ‘కచ్చా బాదం’ (బెంగాలీ భాషలో ‘కచ్చా బాదం’ అంటే పల్లీలు) పాట కైకట్టి పాడాడు. అతని పాట అక్కడివాళ్లకి బాగా నచ్చింది. దాంతో భువన్​  పాడుతుండగా వీడియో తీసి యూట్యూబ్​లో పెట్టారు ఒకరు. అప్పటినుంచి  కచ్చా బాదం పాట  సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. ఈ మధ్యే ఈ పాట రీ–మిక్స్​ కూడా వచ్చింది.     
ఛాయ్​వాలా టు మోడల్​...  పాకిస్తాన్​లో ఇస్లామాబాద్​లో ఛాయ్​ బండి నడిపేవాడు అర్షద్ ఖాన్​. అతను ఛాయ్ అమ్ముతున్న ఫొటో 2006లో సోషల్​మీడియాలో వైరల్​ అయింది. నీలి కళ్లు, స్టన్నింగ్​ లుక్​ ఉన్న అతడికి మోడలింగ్​ ఛాన్స్​లు వచ్చాయి. ఇప్పుడు టీవీ షోల్లో యాక్ట్ చేస్తూ బిజీ అయ్యాడు.  సొంతంగా కెఫె కూడా పెట్టాడు. స్కూల్​కి కూడా వెళ్లని అర్షద్​ తన లైఫ్​ ఇంతలా మారుతుందని కలలో కూడా ఊహించి ఉండడు.  
సెలబ్రిటీ ట్వీట్స్, పోస్ట్​లు   
సెలబ్రిటీలు కూడా ఫేస్​బుక్​, ట్విట్టర్​లో యాక్టివ్​గా ఉంటారు. టాలెంట్​ ఉన్నవాళ్లని ఎంకరేజ్​ చేస్తుంటారు. అందరిలానే సొసైటీలోని సమస్యలపై స్పందిస్తుంటారు. సోనుసూద్​, శిల్పాశెట్టి, మసాబా గుప్తా, వరుణ్​ ధావన్​, టైగర్ ష్రాఫ్​, దిశాపటానీ, విజయ్ ​దేవరకొండ  రెగ్యులర్​గా తమ వర్కవుట్​, హెల్దీలైఫ్​ స్టయిల్​ గురించి ఇన్​స్టాగ్రామ్ పోస్ట్​లు పెడుతుంటారు. లాక్​డౌన్​​ టైమ్​లో ఫ్యాన్స్​తో టచ్​లో ఉండేందుకు సోషల్​మీడియా సైట్స్ వీళ్లకు చాలా యూజ్​ అయ్యాయి. వీళ్లలో సోషల్​మీడియా ఇన్​ఫ్లుయెన్సర్స్​ కూడా ఉన్నారు. 
టాలెంట్​ని చూపించేందుకు
సోషల్​ మీడియా టాలెంట్​ హబ్​ కూడా. యూజర్లు కూడా కొత్త టాలెంట్​ని ఎంకరేజ్​ చేస్తూ కామెంట్లు, పోస్టులు పెడుతుంటారు. ఒకప్పుడు ఎవరో ఒకరు గుర్తించి ఎంకరేజ్​ చేస్తే తప్ప ఒకరి టాలెంట్​ అందరికీ తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు అలా కాదు. ఎవరికివాళ్లు తమ  సింగింగ్​, ఆర్ట్​, డాన్స్​ టాలెంట్​ని అందరికీ చూపించొచ్చు. వీడియో తీసి సోషల్​మీడియాలో పెడితే చాలు... అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంతకుముందు టిక్​టాక్​ ఇన్​స్టా రీల్స్​, ఇన్​స్టా స్టోరీలు వంటివి టాలెంట్​ని చూపించే వేదిక అవుతున్నాయి. అమెజాన్​, రిలియన్స్​ వంటి పెద్ద పెద్ద కంపెనీలే కాదు   స్టార్టప్స్, ఎంట్ర​ప్రెనూర్స్​ కూడా తమ ప్రొడక్ట్​ గురించి అందరికి తెలిసేలా చేయడానికి సోషల్​మీడియా వాడుతున్నారు. కొన్ని సంస్థలైతే  సోషల్​ మీడియా యాక్టివిటీస్​ నచ్చితేనే జాబ్​ ఆఫర్​ చేస్తున్నాయి. 
వాట్సాప్​  నెంబర్​ వన్​ 
మనదేశంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియాలో యాప్​ ఏంటో తెలుసా... వాట్సాప్. ఈ యాప్​ ఎందుకంత పాపులర్​ అంటే...  ఇంగ్లీష్​లేనే కాకుండా లోకల్​ లాంగ్వేజ్‌‌లో మెసేజ్​ పంపొచ్చు. పెద్దగా చదువుకోని వాళ్లు కూడా వాట్సాప్​ని ఈజీగా ఉపయోగించొచ్చు. మెసేజ్​, ఫొటోలు పంపించడమే కాదు ఆడియో, వీడియో కాల్​ చేసుకోవచ్చు కూడా. సిటీలో లేదా విదేశాల్లో ఉన్నవాళ్లకి ఊరి ముచ్చట్లు తెలుసుకునేందుకు వాట్సాప్ చాలా యూజ్​ అవుతుంది. దూరంగా ఉన్న కొడుకులు, కూతుళ్లు, మనుమండ్లు, మనుమరాండ్లని  వీడియో కాల్​లో చూసి మురిసిపోయే అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు చాలామందే. అందుకే వాట్సాప్​కి అంత క్రేజ్​. ఇందులో పోస్ట్​ పెడితే క్షణాల్లో గ్రూప్​లోని వాళ్లందరికి వెళ్తుంది. క్లాస్​మేట్​ గ్రూప్, విలేజ్​ గ్రూప్​, ఆఫీస్​లో కొలీగ్స్​ ​ గ్రూప్​, ఫ్యామిలీ గ్రూప్.... ఇలా బోలెడు గ్రూప్​లు ఉన్నాయి. 
పొలిటికల్​ క్యాంపెయిన్
సోషల్​ మీడియాలో రాజకీయ పార్టీలు, పాపులర్​ లీడర్స్​, ఆయా పార్టీల తీరుతెన్నుల గురించిన చర్చ కూడా నడుస్తుంది. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు... అన్నింటికి సోషల్​ మీడియా సెల్స్​ ఉన్నాయి. ఇందులో పనిచేసేవాళ్లు ఏరోజుకారోజు అప్​డేట్స్​ని ఫేస్​బుక్​, ట్విట్టర్​లో​ పోస్ట్ చేస్తుంటారు. ఎలక్షన్​ టైమ్​లో సోషల్​మీడియా వింగ్​ ద్వారా ఇ–క్యాంపెయిన్​ చేస్తుంటారు.
కొత్త ఫీచర్లతో కొత్తగా...
ఇది అసలే డిజిటల్​ కాలం. మొబైల్​ ఫోన్​ అయినా, గాడ్జెట్​ అయినా కొత్త ఫీచర్లు ఉంటేనే కొంటున్నారు. అంతేకాదు కొత్త ఫీచర్లు, సేఫ్టీ బాగున్న సోషల్​ మీడియా సైట్లకే ఓటేస్తున్నారు చాలామంది. దాంతో  సోషల్​మీడియా సైట్ల మధ్య పోటీ మొదలైంది. యూజర్ల ఇంట్రెస్ట్​, కంఫర్ట్, సేఫ్టీ కోసం రెగ్యులర్​గా కొత్త అప్​డేట్స్​, ఫీచర్స్​ తెస్తున్నాయి. ప్రైవసీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. వాట్సాప్​ ఈమధ్యే యుపిఐ పేమెంట్​ ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్​ మెసెంజర్​ స్ప్లిట్​ పేమెంట్​ అప్లికేషన్​ తెచ్చింది.  కంటెంట్ క్రియేటర్స్​కి డబ్బులు వచ్చేలా ఇన్​స్టాగ్రామ్​ పేమోడ్ తీసుకొచ్చింది.  
సోషల్​ మీడియాలో చెడు 
సోషల్​ మీడియా అనేది రెండు వైపులా పదునున్న కత్తి.  ఇందులో ఏం పోస్ట్​ చేస్తున్నాం? ఏం షేర్​ చేస్తున్నాం? అనేది చాలా ముఖ్యం.  సోషల్​ మీడియాని ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తే అంత మంచిది.  ఎందుకంటే ఇందులో చెడు కూడా ఉంది. ఫేస్​బుక్​ ఫ్రెండ్​షిప్​తో మోసపోయినవాళ్లు చాలామంది. ఆన్​లైన్​లో మాటలు కలిపి, ప్రేమ పేరుతో వేధించేవాళ్లు ఎక్కువయ్యారు. అంతేకాదు ట్రోలింగ్​ కారణంగా ప్రాణాలు తీసుకున్నారు కొందరు. తప్పుడు వార్తలు ట్రెండింగ్​తో అవమాన పడ్డవాళ్లు, పరువునష్టం కేసులు పెట్టిన వాళ్లు ఉన్నారు. ఈమధ్య సోషల్‌‌మీడియాలో అబ్​సీనిటీ, హేట్రెడ్​ పోస్టులు, ఫేక్​న్యూస్​ తిరగడం ఎక్కువైపోతోంది. ముఖ్యంగా ఆడవాళ్లపై ఆన్​లైన్​ వేధింపులు, ట్రోలింగ్​, స్టాకింగ్​ వంటివి పెరుగుతున్నాయి. దాంతో కొందరు డిప్రెషన్​లోకి వెళ్తున్నారు. రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్​ పోస్ట్​ చేస్తుంటారు మరికొందరు. దాంతో ఒక ప్లేస్​లోని చిన్న గొడవ కాస్త పెద్దదయ్యే ఛాన్స్​ ఉంది. సెలబ్రిటీలని బాడీ షేమింగ్​ చేయడం, ‘బుల్లి బాయ్​’ వంటి యాప్స్​ని ప్రమోట్​ చేయడం కూడా ఎక్కువైంది.
క్రెడిబిలిటీ తక్కువ
సోషల్​మీడియాలో వచ్చే న్యూస్​కి క్రెడిబిలిటీ తక్కువ. దాంతో, ఆ న్యూస్​ ఎంత వరకు నిజం అనేది చెప్పలేం. న్యూస్​పేపర్లు, టీవీల్లో ఆ న్యూస్​ వస్తేగాని కన్ఫామ్​ చేసుకోలేం. అందుకే సోషల్​మీడియా యూజర్లకి సెల్ఫ్​ రెగ్యులేషన్​ ఉండాలి. అప్పుడే అందులో వచ్చే ఫేక్​ న్యూస్​ని కంట్రోల్​ చేయడం సాధ్యమవుతుంది. మరో విషయం... చాలామంది సోషల్​మీడియాని ఒక విషయం మీద తమ ఒపీనియన్​ని ఓపెన్​గా చెప్పేందుకు ఎక్కువగా వాడుతుంటారు.  ఫ్రీడమ్​ ఆఫ్​ ఎక్స్​ప్రెషన్​కి సోషల్​మీడియా వేదిక​ అవుతోంది. అయితే, కొన్నిసార్లు ఒకరి ఒపీనియన్​ కొందరికీ తప్పుగా అనిపించొచ్చు. దాంతో వాళ్లపై ఆన్​లైన్​ వేధింపులు ఎక్కువయ్యే ఛాన్స్​ ఉంది. భావ వ్యక్తీకరణ స్వేఛ్చకి భంగం కలగకుండా చూసేందుకు ‘ఎక్స్​ప్రెషన్​ రైట్స్​ కోర్టులు’ ఉండాలి. మానవ హక్కులని కాపాడేందుకు ‘హ్యూమన్​ రైట్స్​ కమిషన్​’ ఉన్నట్లే... ఫ్రీడమ్​ ఆఫ్ ఎక్స్​ప్రెషన్​కి ఇబ్బంది రాకుండా చూసేందుకు ‘స్టేట్​ ఎక్స్​ప్రెషన్స్​ రైట్స్​​ కమిషన్’​ ఉండాలని ఇన్ఫర్మేషన్​ కమిషన్​ మాజీ ఛైర్మన్ మాడభూషి శ్రీధర్​ ఒకసారి అన్నారు. 
పొలిటికల్​ లీడర్ల ట్వీట్ల గొడవలు
కేంద్ర ప్రభుత్వ విధానాలపై, ఆత్మనిర్భరభారత్, మేకిన్​ ఇండియా, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్​.... ఇలాంటి వాటిపై  కాంగ్రెస్ లీడర్లు రాహుల్​ గాంధీ, మల్లికార్జున ఖర్గే ట్విట్టర్​లో అసహనం వ్యక్తం చేయడం, వాళ్ల మాటల్లో నిజం లేదంటూ కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ లీడర్లు  ట్విట్టర్​లో పోస్ట్​లు పెట్డడం చూశాం. తెలంగాణలో కూడా బీజేపీ, టిఆర్​ఎస్​ పార్టీల నాయకుల మధ్య ట్విట్టర్​ వార్​ నడుస్తూనే ఉంది. జాబ్​ నోటిఫికేషన్ల గురించి, వడ్లు కొనడం, కనీస మద్ధతు ధర మీద బీజేపీ ఎంపీలు బండి సంజయ్​, ధర్మపురి అరవింద్​, రామచంద్రరావు, ఐటీ మినిస్టర్​ కేటీఆర్​ మధ్య ట్విట్టర్​లో మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్​ లీడర్​ రేవంత్​ రెడ్డి చేసిన ‘బీజేపీ, టీఆర్​ఎస్ భాయి​ భాయి​’ ట్వీట్​కి బీజేపీ, టీఆర్​ఎస్​ లీడర్లు కౌంటర్​ ఇస్తూ ట్వీట్లు చేశారు. 
ఆన్​లైన్​ పేకాట, మోసాలు
ఆన్​లైన్​ రమ్మీ, క్యాసినో వంటివి సోషల్​మీడియాలో పెరుగుతున్నాయి. యూజర్ల పాస్​వర్డ్స్​ హ్యాక్​ చేసి, వాళ్ల అకౌంట్​ డీటెయిల్స్​ కాజేస్తారు సైబర్​ నేరగాళ్లు. అంతేకాదు ఫేక్​ అకౌంట్స్​ ద్వారా ఆన్​లైన్​ మోసాలు చేసేవాళ్లు చాలామందే. లాటరీ, ఫ్రీ గిఫ్ట్​ కార్డ్ స్కామ్స్​ వంటివి కూడా సోషల్​మీడియాలో జరుగుతున్నాయి. 
సోషల్​మీడియాతో స్టార్​ అయి బిగ్​బాస్​కి లోకల్​ సెలబ్రిటీలని, సోషల్​మీడియాలో ఫాలోయింగ్ ఉన్నవాళ్లని బిగ్​​బాస్ హౌస్​లోకి తీసుకుంటారు. యూట్యూబ్​ వీడియోలు, వెబ్​సిరీస్​ల ద్వారా పాపులర్​ అయి బిగ్​బాస్​లోకి వెళ్లింది వీళ్లే... ​‘పటాస్’ షోతో పాపులర్​ అయిన శ్రీముఖి, ‘దేత్తడి’ యూట్యూబ్​ ఛానెల్​తో సోషల్​మీడియా స్టార్​ అయిన అలేఖ్య హారిక, ‘సూర్య’ వెబ్​ సిరీస్​ ఫేమ్​ షణ్ముఖ్​ జశ్వంత్, దీప్తి సునయన, ‘ఫన్​బకెట్​’ మహేష్​ విట్టా...  వీళ్లందరూ  బిగ్​బాస్ హౌస్​లో ఎంట్రీ ఇచ్చారు. 
మన సోషల్​ మీడియా యాప్స్​
ఫేస్​బుక్, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​... ఇవన్నీ వేరే దేశాలకు చెందినవి. మనవాళ్లు డిజైన్​ చేసిన సోషల్​మీడియా యాప్స్​ లేవా? అంటే ఉన్నాయి.  ఇవి టిక్​టాక్​ బ్యాన్​ తర్వాత పాపులర్​ అయ్యాయి.   
షేర్​చాట్...

ఈ యాప్​ని ఐఐటీ కాన్పూర్​లో చదివిన అంకుశ్​ సచ్​దేవ్​, భాను ప్రతాప్​ సింగ్, ఫరీద్​ అహ్సాన్​ 2015లో   స్టార్ట్​ చేశారు. 15 భాషల్లో ఉన్న ఈ యాప్​ని  నెలకి160 మిలియన్ల యూజర్లు  ఉపయోగిస్తున్నారు. 
కూ...

మొదట్లో ‘కు కూ కు’గా పిలిచేవాళ్లు. ప్రమేయ రాధాకృష్ణ దీన్ని తయారుచేశాడు. ఈ యాప్​ 2020 ఆగష్టులో ‘ఆత్మనిర్భర్ యాప్ ఇన్నొవేషన్​ ఛాలెంజ్’​ అవార్డ్ గెలుచుకుంది.   ట్విట్టర్​ని పోలిన ఈ యాప్​లో 400 క్యారెక్టర్స్ ఉన్న టెక్స్ట్​ పోస్ట్ చేయొచ్చు.  ఇంగ్లీష్​తో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మరాఠి భాషల్లో  ఉంది. 
చింగారీ...

దీన్ని 2018లో డిజైన్​ చేశారు. ఇందులో లిప్​ సింక్​ చేస్తూ, డాన్స్​, సినిమా డైలాగ్స్​కి వాయిస్​ ఓవర్​ చేస్తూ ఎంజాయ్​ చేయొచ్చు. మనదేశంలో టిక్​టాక్​ని బ్యాన్​ చేసిన తర్వాత చింగారీ యాప్ వాడేవాళ్ల సంఖ్య పెరిగింది. ​  
జోష్​.... మనదేశంలోని నెంబర్​ వన్​ షార్ట్​ వీడియో  యాప్​. దీన్ని డైలీ హంట్​ న్యూస్​ సైట్​ 2020లో తీసుకొచ్చింది. 14 భారతీయ భాషల్లో  అందుబాటులో ఉంది. నోకియాలో పనిచేసిన ఉమేశ్​ కులకర్ణి, చంద్రశేఖర్​ సొహోని  డిజైన్​ చేశారు.   కామెడీ,  ప్రాంక్​ వీడియోల్ని  షేర్​ చేసుకోవచ్చు.  
ఫ్లిక్...

  ఇది సోషల్​మీడియా యాప్​ మాత్రమే కాదు డేటింగ్​ యాప్​ కూడా. దీన్ని బహదూర్​ సిన్హ్​ జడేజీ 2019లో డిజైన్ చేశాడు. కొత్తవాళ్లని కలిసేందుకు, లైఫ్​ పార్ట్​నర్​ని సెలక్ట్​ చేసుకునేందుకు ఈ యాప్​ యూజ్​ అవుతుంది.  
మోజీ...

ఇదొక వీడియో షేరింగ్​ యాప్. మోజీలో 15 సెకన్ల నుంచి నిమిషం నిడివి ఉన్న వీడియోలు పోస్ట్​ చేయొచ్చు. టిక్​టాక్​ని బ్యాన్​ చేసిన తర్వాత ఈ యాప్​ని డెవలప్​ చేశారు. ఈ యాప్​ 15 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. 2021లో  100 మిలియన్ల మంది డౌన్​లోడ్​ చేసుకున్నారు. 
కుటుంబ్​...

ఈ యాప్​ని అభిషేక్ కేజ్రివాల్​, మోహిత్​ శర్మ డెవలప్​ చేశారు. కరోనా సెకండ్​ వేవ్​ టైమ్​లో  చాలా ఎన్జీవోలు ఈ యాప్​ సాయంతో డొనేషన్స్​ కలెక్ట్ చేశాయి. 
మిత్రో​...

దీన్ని 2020లో శివాంక్​ అగర్వాల్​, అనిష్​ ఖండేల్​వాల్​ తెచ్చారు. ఇందులో వీడియోని క్రియేట్​ చేయడంతో పాటు ఎడిటింగ్​ చేయొచ్చు. 
లెహెర్...

ఇందులో ఆడియో, వీడియో డిస్కషన్స్ చేసుకోవచ్చు. దీన్ని 2018లో అతుల్ జాజు, వికాస్​ మల్పాని డిజైన్​ చేశారు.  కమ్యూనిటీ లైవ్​ డిస్కషన్స్​కి ఈ యాప్​ బాగుంటుంది. 

100 మిలియన్​ యాక్టివ్​ యూజర్లు ఉన్న సోషల్​ మీడియా సైట్స్​ ఇవే..
ఫేస్​బుక్     -    291 కోట్ల మందికి పైగా​
యూట్యూబ్​    -    2.291 బిలియన్​
వాట్సాప్​    -    2 బిలియన్
ఫేస్​బుక్ మెసెంజర్​    -    1.3 బిలియన్
ఇన్​స్టాగ్రామ్    -    1.2 బిలియన్

 

::: సంతోష్​ బొందుగుల ::: వెలుగు నెట్​వర్క్​