హైదరాబాద్ సిటీ, వెలుగు : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వారం రోజులు పాటు జర్నలిస్టుల కోసం ప్రత్యేక పాస్ పోర్టు మేళా నిర్వహిస్తున్నట్టు రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ స్నేహజ జొన్నలగడ్డ తెలిపారు. గురువారం పాస్‌పోర్టు మొబైల్ వెహికల్ ద్వారా ఆమె పాస్‌పోర్టు సేవలను ప్రారంభించారు. స్నేహజ మాట్లాడుతూ అన్ని డాక్యుమెంట్లు పూర్తి చేసిన వారికి సకాలంలో పాస్ పోర్టు జారీ చేస్తామని చెప్పారు.
మొదటిసారి మొబైల్ పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లోనే ప్రారంభించామన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్. విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రోజుకు 40 మంది చొప్పున 600 మందికి పాస్ పోర్టులను జారీ చేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టు కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల, ఉపాధ్యక్షుడు అరుణ అత్తలూరి, ఏ. రాజేశ్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్దెల్లి బాపూరావు, ట్రెజరర్రమేశ్ వైట్ల, ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ముత్యాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
