- స్టూడెంట్లపై కేసులు పెట్టబోమని హామీ ఇవ్వాలని డిమాండ్
- లేదంటే నిరాహార దీక్ష కొనసాగిస్తానని హెచ్చరిక
న్యూఢిల్లీ: విద్యార్థులు, నిరసనకారులపై కేసులు పెట్టబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే తాను వెంటనే నిరాహార దీక్షను విరమిస్తానని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌కు లేఖ రాశారు. సోమవారం నిర్వహించిన చలో పార్లమెంట్ ర్యాలీలో పాల్గొన్న స్టూడెంట్లు.. నిరసనకారులపై ప్రతీకార చర్యలు, కేసులు పెట్టబోమని హామీ ఇవ్వాలని ఆయన లేఖలో కోరారు.
శాంతియుతంగా జరిగిన ఆ ర్యాలీలో పాల్గొన్నవాళ్లపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 65 మంది ఎంపీలు తనను దీక్ష విరమించాలని కోరినట్లు పేర్కొన్నారు. అయితే, ఉద్యమంలో పాల్గొన్న స్టూడెంట్లకు రక్షణ కల్పించకుండా తాను వెనక్కి తగ్గలేనని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. ఉద్యమానికి అండగా నిలిచిన యువకుల భవిష్యత్తును పణంగా పెట్టి దీక్షను విరమించలేనని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి హామీ రాకపోతే మాత్రం నిరవధికంగా దీక్ష కొనసాగిస్తానని హెచ్చరించారు.
దయచేసి దీక్షను విరమించండి: సోనమ్‌కు సీజేపీ లేఖ
సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) బుధవారం బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. ఆయన చేసిన త్యాగం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొంది. అయితే, ఆయన ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని, క్షేమంగా ఉండాలని ఆకాంక్షించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఎక్స్‌లో స్పందిస్తూ, వాంగ్‌చుక్ దీక్షను విరమించాలని కోరారు. అలాగే, తమ డిమాండ్లు నెరవేరేదాకా సీజేపీ చేపట్టిన ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మీ వాయిస్‌ను పార్లమెంట్‌లో వినిపిస్తాం: అపొజిషన్ ఎంపీలు
పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థ సంస్కరణ అంశాలను పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావిస్తామని, ఉద్యమానికి మద్దతు ఇస్తామని ప్రతిపక్ష ఎంపీలు వాంగ్‌చుక్‌కు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ వివేక్ టంకా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్‌తో పాటు పలువురు ఎంపీలు గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్‌ను, ఆయన భార్య గీతాంజలిని బుధవారం పరామర్శించారు. అనంతరం ఆయనకు లేఖ అందజేసి నిరాహార దీక్షను విరమించాలని కోరారు. ‘‘దేశానికి, యువతకు మీ త్యాగం కంటే మీ మార్గదర్శకత్వం ఎంతో అవసరం. మీరు బాధలో కాదు.. సేవలో ఉండాలి’’ అని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు
