ఓయూ, వెలుగు: పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ.. తీవ్ర ఒత్తిడికి కారణమవుతున్న నీట్‌ను రద్దు చేయాలని దక్షిణ జనతా పార్టీ విద్యార్థి విభాగం, దక్షిణ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేశాయి. శనివారం ఓయూలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో నిర్వహించిన సదస్సుకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజేపీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్రీకృత వైద్య ప్రవేశ పరీక్ష విధానం వల్ల తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు చెందిన ఎంబీబీఎస్ సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులు పొందే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య ప్రవేశ విధానాన్ని రూపొందించుకునే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, వల్లపు రెడ్డి, రవీందర్ రెడ్డి, శర్మ, జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
