కేరళను తాకిన రుతుపవనాలు

కేరళను తాకిన రుతుపవనాలు

హైదరాబాద్​, వెలుగునైరుతి రుతుపవనాలు ఇండియాలోకి వచ్చేశాయి. సోమవారం కేరళ తీరాన్ని తాకాయి. దీంతో అక్కడ వానలు పడుతున్నాయి. రుతుపవనాలు ఈ నెల 5న కేరళను తాకుతాయని తొలుత అంచనా వేసినా వాతావరణ మార్పుల వల్ల ముందే చేరుకున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులు, మాల్దీవులు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు,  తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోకి ఈ నెల రెండో వారంలో నైరుతి ప్రవేశించొచ్చని అంచనా వేసింది. ఈసారి సాధారణ వర్షపాతం నమోదు కావొచ్చని చెప్పింది. ఈ సారి 4 నెలల సుదీర్ఘమైన వానాకాలం ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్​మోహపాత్ర తెలిపారు.

నేడు అక్కడక్కడ వానలు 

రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం) తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవొచ్చని హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్‌‌గిరి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురవొచ్చని చెప్పింది.

సల్లబడ్డ వాతావరణం

రాష్ట్రంలో వాతావరణం కొంత మేర చల్లబడింది. మూడు రోజుల క్రితం 46 డిగ్రీల వరకు టెంపరేచర్లు నమోదవగా సోమవారం 40 డిగ్రీలకు పడిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో సోమవారం అత్యధికంగా 40.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చిన్నగూడూరులో 40.3 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లెలో 40.1 డిగ్రీలు, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మిలో, సూర్యాపేట మండలం ఉర్లుగుండలో 40 డిగ్రీలు రికార్డయింది.

ప్రాజెక్టులపై బీజేపీ పోరుబాట