అసెంబ్లీకి చేరిన కోతుల పంచాది.. ప్రభుత్వానికి స్పీకర్ కీలక సూచన

అసెంబ్లీకి చేరిన కోతుల పంచాది.. ప్రభుత్వానికి స్పీకర్ కీలక సూచన

హైదరాబాద్: కాంగ్రెస్ నేత, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ గ్రామాల్లోని కోతుల సమస్యను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో కోతుల సంఖ్య బాగా పెరిగిపోయిందని.. టమాటా, మొక్కజొన్న వంటి పంటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు.

 దీంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. కోతుల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా పురపాలక ప్రాంతాల్లో వీధి కుక్కల సమస్య బాగా పెరిగిపోయిందని.. రాత్రి వేళల్లో గుంపులుగా సంచరిస్తూ మనుషులపై దాడులు చేస్తున్నాయన్నారు. వీధి కుక్కలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. కోతుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని.. తన సొంత జిల్లా వికారాబాద్ ప్రాంతంలో కూడా కోతుల సమస్య వల్ల వ్యవసాయానికి అంతరాయం కలుగుతుందని.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.