రీ ఎంట్రీ ఇస్తా.. 100 వికెట్లు తీస్తా : శ్రీశాంత్

రీ ఎంట్రీ ఇస్తా.. 100 వికెట్లు తీస్తా : శ్రీశాంత్

మళ్లీ క్రికెట్ లోకి వస్తానని నమ్మకంగా చెబుతున్నాడు క్రికెటర్ శ్రీశాంత్. టెస్ట్ క్రికెట్ టీమ్ లో చోటు సంపాదిస్తానని అన్నాడు. కెరీర్ లో వంద వికెట్లు తీయడమే ఇపుడు తన లక్ష్యమని అన్నాడు శ్రీశాంత్. న్యాయపోరాటం ఫలించిందనీ… బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పాడు.

ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలు రుజువై జీవితకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ లో నిషేధాన్ని ఎదుర్కొంటున్న శ్రీశాంత్ కు… బీసీసీఐ మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీశాంత్ పై  జీవితకాల  నిషేధం ఎత్తేసి.. నిషేధం గడువును ఏడేళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.  బీసీసీఐ అంబుడ్స్ మెన్   డీకే జైన్ ఉత్తర్వులు కూడా జారీచేశారు. తన క్రికెట్ కెరీర్ పై బ్యాన్ పడి ఇప్పటికే ఆరేళ్లు గడిచిపోయింది. దీంతో.. వచ్చే ఏడాది  సెప్టెంబర్ 13 తో శ్రీశాంత్ పై ఉన్న నిషేధం తొలగిపోతుంది.

ఐపీఎల్  2013  సీజన్ లో  రాజస్థాన్ రాయల్స్  తరపున  ఆడిన  శ్రీశాంత్ పై మ్యాచ్  ఫిక్సింగ్  ఆరోపణలు వచ్చాయి.  అతనితో  పాటు   అజిత్ చండీలా, అంకిత్  చవాన్ పై   జీవితకాల నిషేధం  విధించింది  బీసీసీఐ. దీంతో న్యాయపోరాటానికి  దిగిన  శ్రీశాంత్   కోర్టుల చుట్టూ  తిరిగాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో.. సుప్రీం కోర్టు అతడిపై  నిషేధం  తగ్గించాలని  బీసీసీఐ అంబుడ్స్ మెన్ ను  ఆదేశించింది.