శ్రీ శ్రీమతి నిర్మలా శ్రీవాస్తవ (శ్రీ మాతాజీ నిర్మలా దేవి) చిన్నవయసు నుంచే తన చుట్టుపక్కల ప్రజలందరూ ఎన్నో బాధలు, కష్టాలు పడుతుండటం గమనించారు. అనారోగ్యం, అవినీతి, లంచగొండితనం, వ్యసనాలు, ద్వేషం, అసూయ.. ఇలాంటి వాటి వల్ల సమాజం మొత్తం ఒక విషవలయంలో చిక్కుకుపోయిందని తెలుసుకున్నారు. ప్రపంచమంతా నెలకొన్న ఈ అస్తవ్యస్త పరిస్థితిని చూసి నిర్మలాదేవి చలించిపోయారు. అందుకే ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేందుకు నిత్యం ఆలోచించేవారు.
మెడిసిన్ చదివి..
మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత నిర్మలాదేవి వివాహం చేసుకున్నారు. పిల్లలను పెంచి, వాళ్ల వివాహాలు జరిపించి తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించారు. భర్త సి.పి. శ్రీవాస్తవ్ ఐఏఎస్ అధికారి. ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి సెక్రటరీగా పనిచేసేవారు. ఆమె ఒకవైపు కుటుంబ జీవితం సాగిస్తూనే మనుషుల బాధలకు మూల కారణాల గురించి లోతుగా ఆలోచించేవారు.
మనిషి ఎప్పుడూ బయటి ప్రపంచం వైపే చూస్తూ క్షణిక సుఖాల వెనక పరుగెడుతున్నాడని, అంతర్ముఖంగా (లోపలికి) చూడడం లేదని గ్రహించారు. శరీరంలోని పరమాత్మ శక్తి అయిన ఆత్మ మీదకు మళ్లించగలిగితే ఆధ్యాత్మిక పరిపక్వత చెంది మనిషిలో పరివర్తన వస్తుంది. అప్పుడు చిన్నతనంలో తనలో స్వాభావికంగా ఉన్న పసితనపు అమాయకత్వాన్ని తిరిగి స్థిరపరచుకోవచ్చు. తద్వారా మనిషిని సమతుల్యతలో ఉంచవచ్చు అని మాతాజీ తలిచారు. అయితే.. మన శరీరంలోనే అంతర్గతంగా ఉండే కుండలినీశక్తి ద్వారానే అది సాధ్యమవుతుంది.
కుండలినీ శక్తి అంటే..
తల్లి గర్భంలో ఉన్నప్పుడు (సుమారు 2–3 నెలల వయసులో) పసిపిల్లవాడి బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మ శక్తి ప్రవేశిస్తుంది. వెన్నెముక భాగంలో 3 నాడులుగా, 7 చక్రాలుగా ఏర్పడుతుంది. మిగిలిన శక్తి సాక్రమ్ బోన్ (త్రికోణాకార ఎముక)లో 3½ చుట్లు చుట్టుకొని ఉంటుంది. అదే కుండలినీ శక్తి.
పిల్లలకు 9–10 సంవత్సరాలు వచ్చే వరకు ఈ శక్తి వెన్నెముక ద్వారా ఊర్థ్వ ముఖంగా ప్రయాణిస్తూ బాహ్యపరంగా ఉన్న పరమాత్మ ప్రేమ శక్తితో అనుసంధానమవుతూ ఉంటుంది. ఆ వయసులో పిల్లలు భగవంతుని రక్షణలో ఉంటారు. తర్వాత అది క్రమంగా నిద్రాణ స్థితికి వెళ్తుంది.
ఈ నిద్రాణ కుండలినీ శక్తిని జాగృతం చేసి, శిరస్సు మీద ఉన్న సహస్రార చక్రాన్ని ఛేదించి బాహ్యంగా ఉన్న పరమాత్మ ప్రేమ శక్తితో అనుసంధానం చేయగలిగితే, మనిషి శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యల నుంచి విముక్తి పొంది, వివేకం, సమతుల్యత, శాంతి పొందుతాడు. ఇలా విశ్వమానవ సౌభ్రాతృత్వం ఏర్పడుతుందని మాతాజీ భావించారు.
చారిత్రక ఘటన
ఆ కాలంలో అసత్య గురువులు ప్రజలను మోసం చేస్తుండడం చూసి మాతాజీ కలత చెందారు. ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు అనుకున్నారు. మానవులు తమ మూర్ఖత్వం, అంధ విశ్వాసాల వల్ల సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా పోరాడితే భగవంతుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది అని గ్రహించారు. అందుకు పరిష్కారం మనిషిలోని కుండలినీ శక్తిని తిరిగి జాగృతపరిచి తద్వారా ఆత్మసాక్షాత్కారం ప్రసాదించడమే అని నమ్మారు.
అయితే.. ఒకప్పుడు కుండలినీ జాగృతి కావాలంటే సర్వస్వం త్యాగం చేసి, అడవులకో, హిమాలయాలకో వెళ్లి వందల సంవత్సరాలు కఠోర తపస్సు చేయాల్సిఉండేది. మనిషి ఏ త్యాగమూ చేయకుండా, దేనినీ పరిత్యజించకుండా రోజువారీ జీవితానికి ఏ ఆటంకం లేకుండా ఈ కార్యం నిర్వహించడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఏదైనా మార్గం కనుగొనాలని నిర్మలాదేవి నిశ్చయించుకున్నారు. వెంటనే 1970వ సంవత్సరం మే నెలలో గుజరాత్‌లోని నార్గోల్ సముద్ర తీరంలో ఒక సరుగుడు చెట్టు కింద రాత్రంతా ధ్యానం చేశారు.
►ALSO READ | ఆధ్యాత్మికం : పరాశక్తికి ప్రతిరూపం అమ్మ ..తల్లి గర్భంలో ఉండగానే వ్యక్తిత్వానికి పునాది పడుతుంది..!
తెల్లవారుజామున మాతాజీ సహస్రార చక్రం తెరుచుకుంది. మాతాజీ మాటల్లో చెప్పాలంటే.. భూమి నుంచి ఒక్కసారిగా భూగర్భ జలం ఉవ్వెత్తున ఆకాశం వైపు అతి వేగంగా లేచినట్లుగా తనలోని కుండలినీ శక్తి ఉత్థానం జరిగింది. తల మాడు మీద బ్రహ్మరంధ్రం ఛేదించుకుని ఆకాశంలోకి ఒక కాంతి పుంజం చక్రాల గుండా ప్రయాణించి 7 రంగుల హరివిల్లులా వెదజల్లబడింది. ఇది ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో అపూర్వమైన ఘటన.
సహజ యోగం
ఈ ఘటన తర్వాత మాతాజీ సహజ యోగాన్ని ఆవిష్కరించారు. “సహ” అంటే మనతోపాటు ఉన్నది, “జ” అంటే జన్మించిన (కుండలినీ), “యోగ” అంటే కలయిక. అంటే, మనలోని కుండలినీని జాగృతం చేసి విశ్వ చైతన్యంతో కలపడం.
మాతాజీ ప్రపంచం మొత్తం (120 దేశాలు) పర్యటించి కులం, మతం, జాతి భేదాలు లేకుండా లక్షలాది మందికి ఉచితంగా ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారు. సహజ యోగం ద్వారా అనేకమంది శారీరక, మానసిక సమస్యల నుంచి విముక్తి పొందారు.
- డాక్టర్ ప్రతాని రాకేష్-
లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
