భీమా కోరేగావ్‌ కేసు నిందితుడు స్టాన్‌ స్వామి మృతి

భీమా కోరేగావ్‌ కేసు నిందితుడు స్టాన్‌ స్వామి మృతి

గిరిజన హక్కుల కార్యకర్త, భీమా కోరేగావ్‌ కేసులో ముంబైలోని తలోజా జైలులో ఉన్న స్టాన్‌ స్వామి (84) సోమవారం కన్నుమూశారు. అక్టోబర్‌, 2020 నుంచి తలోజా జైలులో ఉన్న స్టాన్‌ స్వామి పార్కిన్‌సన్స్‌ బాధితుడు మాత్రమే కాక కొన్ని రోజుల క్రితమే ఆయన కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. కోవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికి కూడా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో..ముంబై హైకోర్టు ఆదేశాలతో మే 28న హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం నుంచి వెంటిలేటర్‌ పై ట్రీట్మెంట్ తీసుకుంటూ.. సోమవారం ఆయన మృతి చెందారు. 

భీమా కోరేగావ్‌ కేసులో జైలులో ఉన్న స్టాన్‌ స్వామికి గతంలో NIA కోర్టు బెయిల్‌ మంజూరు చేయలేదు. దీంతో ఆయన నవీ ముంబైలోని తాలోజా జైల్లో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలంటూ.. స్వామి తరపు న్యాయవాదులు ఇవాళ ఉదయం బాంబే హైకోర్టును కోరారు. మధ్యాహ్నం విచారణ ప్రారంభించేలోగానే ఆయన కన్నుమూశారు.