అమీర్ పేట్ – హైటెక్ సిటీ రూట్లో.. ఇక లేట్ కాదు

అమీర్ పేట్ – హైటెక్ సిటీ రూట్లో.. ఇక లేట్ కాదు

3 నిమిషాలకో మెట్రో ట్రైన్ నడిపేందుకు చర్యలు

అందుబాటులోకి రానున్న రివర్సల్ ఫెసిలిటీ

నెలాఖరు నుంచి నడిపించనున్న అధికారులు

నెలాఖరునాటికి రివర్సల్ సదుపాయం?

హైదరాబాద్‌, వెలుగు: ఐటీ కారిడార్‌కు సాఫీ ప్రయాణం అందిస్తున్న మెట్రో రైల్‌ మరింత మెరుగైన సేవల దిశగా సాగుతోంది. ప్రస్తుతం 7.5 నిమిషాలకు ఒక ట్రెయిన్‌ నడుస్తుండగా త్వరలోనే 3 నిమిషాలకు ఒక రైల్‌ నడిచే దిశగా మార్గం సుగమం అవుతోంది. అమీర్‌పేట్‌–-హైటెక్‌ సిటీ రూట్‌లో రివర్సల్‌ సదుపాయం లేకపోవడంతో ట్విన్‌ సింగిల్‌ పద్ధతిలో రైళ్లు నడుస్తున్నాయి. సాంకేతికంగా సవాల్​తో కూడిన ఈ పద్ధతి వల్ల మిగిలిన రూట్లతో పోల్చితే తక్కువ ట్రిప్పులు నడుస్తున్నాయి. హైటెక్‌ సిటీ స్టేషన్‌ సమీపంలో చేపట్టిన రివర్సల్‌ సదుపాయం ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానుంది. ఆగస్టు మొదటి వారంలోనే అందుబాటులోకి వస్తుందని భావించినా వర్షాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని సమాచారం. ఒక వేళ ఆటో రివర్స్​ పనులు పూర్తి కాకపోయినా మాన్యువల్​గా కూడా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

నాగోల్–హైటెక్ సిటీ మార్గంలో ఉప్పల్, మెట్టుగూడ, తార్నాక,  సికింద్రాబాద్ స్టేషన్లలో ఎక్కువ మంది ప్రయాణికులు  మెట్రో ఎక్కుతున్నారు. ఉదయం 9  గంటల నుంచి 11  గంటల మధ్య  అమీర్ పేట్,  హైటెక్ సిటీకి 14 వేల  మంది ప్రయాణికుల రద్దీ ఉంటోంది.  పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇటీవల గంటకు ఒక  ట్రైన్  సర్వీస్ పెంచారు. ట్రైన్ ల ఫ్రీక్వెన్సీ కూడా అవసరాన్ని బట్టి పెంచుతున్నారు. అమీర్ పేట్–హైటెక్ సిటీ మధ్య రివర్సల్ సదుపాయం లేకపోవడంతో ప్రస్తుతం  ట్విన్  సింగిల్ లైన్  పద్ధతిలో  ట్రైన్లు నడుపుతున్నారు.  ప్రస్తుతం అమీర్ పేట్, హైటెక్ సిటీ మధ్య 7.5  నిమిషాలకు ఒక  ట్రైన్ నడుస్తోంది. ఈ రూట్‌లో ట్రైన్‌ సర్వీసులు ప్రారంభమైనప్పుడు కూడా అన్ని స్టేషన్లను ఒకేసారి అందుబాటులోకి తీసుకురాలేదు. జూబ్లీహిల్స్‌, పెద్దమ్మ గుడి స్టేషన్‌లను ఆలస్యంగా అందుబాటులోకి తెచ్చారు. రివర్సల్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత  అప్పటి పరిస్థితిని బట్టి  ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తారు. ఈ ఫ్రీక్వెన్సీ సుమారు 3 నిమిషాలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు నడుస్తోందిలా..

కారిడార్–3 లోని  నాగోల్–- హైటెక్ సిటీ మధ్య 28 కిలో మీటర్ల  రూట్లో  23 స్టేషన్లు  ఉన్నాయి. కారిడార్​  మొత్తం 56  కిలో  మీటర్ల  దూరంలో  50  స్టేషన్లు  ఉన్నాయి.  వీటిని కలుపుతూ 7.5 నిమిషాలకొక ట్రెయిన్‌ నడుస్తోంది. ట్విన్‌ సింగిల్‌ పద్ధతిలో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. నాగోల్‌ నుంచి ఒక దాని వెనుక మరొకటి 3 నిమిషాల వ్యవధిలో రెండు రైళ్లు బయల్దేరుతాయి. ఇవి అమీర్‌పేట్‌ మీదుగా హైటెక్‌ సిటీ వరకు వెళ్తాయి. ప్రయాణికులను దింపేసి, స్టేషన్‌ నుంచి కొంచెం ముందుకు వెళ్లి ఆగుతాయి. తిరిగి అదే రూట్‌లో రివర్స్‌ అవుతాయి. హైటెక్‌సిటీ నుంచి రెండు ట్రెయిన్‌లు వెళ్లిన రూట్‌లోనే వెనక్కి వస్తాయి. ఈ సమయంలో నాగోల్‌ నుంచి అమీర్‌పేట్‌ మీదుగా హైటెక్‌సిటీ వెళ్లే ట్రెయిన్‌లు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-5 ప్రాంతంలో డౌన్‌ లింక్‌లోకి వెళ్తాయి. నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ వెళ్లే రెండు ట్రెయిన్‌లకు మధ్యలో  ఒక రైల్‌ నాగోల్‌ నుంచి అమీర్‌పేట్‌ వరకు వెళ్లి తిరిగి నాగోల్‌ వస్తుంది. హైటెక్‌ సిటీ ప్రాంతంలో రివర్సల్‌ సదుపాయం పూర్తయితే అన్ని రూట్‌లలో మాదిరిగానే అమీర్‌పేట్‌–-హైటెక్‌ సిటీ రూట్‌లో 3 నిమిషాలకొక ట్రెయిన్‌ నడుస్తుంది.