బిగ్ బాస్ ఆపేయండి: కేంద్రానికి బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

బిగ్ బాస్ ఆపేయండి: కేంద్రానికి బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
  • వల్గారిటీ ఎక్కువైంది
  • మన దేశ నైతిక విలువలపై దెబ్బ: ఎమ్మెల్యే నంద కిశోర్

న్యూఢిల్లీ: కుటుంబసభ్యులంతా కూర్చుని చూసే టీవీ తెరపై బిగ్ బాస్ షో వల్గారిటీని ప్రదర్శిస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సమాజం నేర్పిన నైతిక విలువలను దెబ్బతీసేలా ఈ షో నడుస్తోందని మండిపడ్డారు. ఈ షో టెలికాస్ట్ చేయకుండా వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

హిందీలో నడుస్తున్న బిగ్ బాస్-13 షోపై తన అభ్యంతరాలను తెలుపుతూ ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్..  కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ ప్రసారాన్ని వెంటనే నిలిపేయాలని ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను కోరారు.

ఆ ఫిర్యాదును అందుకున్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దాన్ని పరిశీలిస్తోంది. షోపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీస్తోంది. ఎమ్మెల్యే ఫిర్యాదును పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలా? వద్దా అన్న దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.