ఏడేండ్లాయే.. పెద్దాస్పత్రులేమాయే?

ఏడేండ్లాయే.. పెద్దాస్పత్రులేమాయే?
  • ఏడేండ్లయినా ఒక్క జిల్లాలోనూ 
  • స్టార్ట్​ కాని సూపర్​ స్పెషాలిటీ హాస్పిటళ్లు 
  • పెద్ద జబ్బొస్తే హైదరాబాదే దిక్కు
  • గాంధీ, ఉస్మానియాల్లోనూ వసతుల్లేవు
  • రెండేండ్లుగా ఆగిన గుండె ఆపరేషన్లు
  • కొత్త జిల్లాల్లో జిల్లా దవాఖాన్లు అప్​గ్రేడ్ ​కాలె

హైదరాబాద్, వెలుగు: జిల్లాకో సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ కట్టిస్తామని సీఎం కేసీఆర్​ చెప్పి ఏడేండ్లయినా ఏ జిల్లాలోనూ ఆస్పత్రులు అందుబాటులోకి రాలేదు. కిడ్నీ, గుండె జబ్బు లాంటి పెద్ద రోగాలకు జిల్లాల్లో కనీస వైద్యం అందించేవాళ్లు కరువయ్యారు. పెద్ద రోగం ఏదొచ్చినా పేషెంట్లు హైదరాబాద్‌‌ వరకు రావాల్సి వస్తోంది. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌‌లో తప్ప రాష్ర్టంలో ఇంకెక్కడా సూపర్ స్పెషలిస్టులు, సూపర్‌‌‌‌ స్పెషాలిటీ డిపార్ట్‌‌మెంట్లు లేవు. ఇక్కడ కూడా పేషెంట్‌‌ లోడ్‌‌ ఎక్కువుండటంతో వైద్యం అంతంతమాత్రంగానే మారింది.

60 కిలోమీటర్లకో సూపర్​ స్పెషాలిటీ అన్నరు

రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​కట్టిస్తానని సీఎం కేసీఆర్‌‌‌‌ అనేక సార్లు హామీ ఇచ్చారు. 2014 నాటి ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లోనూ నిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. 

హైదరాబాద్ వరకూ వచ్చేలోగా పేషెంట్లు మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి 60 కిలో మీటర్లకో సూపర్ స్పెషాలిటీ అందుబాటులోకి తీసుకొచ్చి ఆ మరణాలు లేకుండా చూస్తామన్నారు. కానీ ఇప్పటికీ కనీసం ఒక్క జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తేలేదు. కొత్త దవాఖాన్ల సంగతి పక్కనబెడితే ఇప్పటికే ఉన్న గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద దవాఖాన్లలో కనీస వసతులు కల్పించడంపైనా సర్కారు దృష్టి పెట్టట్లేదు. ఆ రెండు దవాఖాన్లలో ఆపరేషన్ థియేటర్లు, ఎక్విప్‌‌మెంట్ లేక రెండేండ్ల నుంచి గుండె సంబంధిత ఆపరేషన్లు ఆగిపోయాయి. దీంతో రోగులను ప్రైవేటు హాస్పిటళ్లకు రిఫర్ చేస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ర్టో, ఎండోక్రైనాలజీ, నియోనాటాలజీ, సర్జికల్ డిపార్ట్‌‌మెంట్లలో 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అసలు జిల్లా దవాఖాన్లేవి?

తెలంగాణ వచ్చాక 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. జిల్లాలు ఏర్పడగానే ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏరియా హాస్పిటల్స్‌‌ ముందు డిస్ట్రిక్ట్‌‌ హాస్పిటల్ అని బోర్డు మార్చారు. వాటినే జిల్లా హాస్పిటళ్లుగా అప్‌‌గ్రేడ్‌‌ చేస్తామని చెప్పారు. 4 ఏండ్లు అవుతున్నా ఒక్క దవాఖానాను కూడా జిల్లా హాస్పిటల్ స్థాయిలో అప్‌‌గ్రేడ్ చేయలేదు. అప్‌‌గ్రేడేషన్ కోసం కొన్ని హాస్పిటళ్లకు నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్రం నిధులు కేటాయించింది. వాటి పనులూ నత్తనడకన సాగుతున్నాయి. కొత్త జిల్లాల్లోని హాస్పిటళ్లలో పూర్తి స్థాయిలో స్పెషాలిటీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. కొత్త జిల్లాల సంగతి పక్కనబెడితే ఖమ్మం, కరీంనగర్ వంటి పెద్ద హాస్పిటళ్లలోనూ డాక్టర్ల కొరత వేధిస్తోంది. సూపర్ స్పెషాలిటీ పోస్టులున్నా భర్తీ చేసేందుకు సర్కార్ ఇంట్రస్ట్ చూపించట్లేదు. 

టీచింగ్ హాస్పిటళ్లలోనూ అంతే

రాష్ర్టంలో నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబ్‌‌నగర్‌‌, నిజామాబాద్‌‌‌‌ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా కొత్త దవాఖాన్లను మాత్రం నిర్మించలేదు. అప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న జిల్లా హాస్పిటళ్లనే మెడికల్ కాలేజీల అనుబంధ హాస్పిటల్స్‌‌గా మార్చేశారు. అవి ఇప్పటికీ జిల్లా హాస్పిటళ్ల స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పటికీ వాటిల్లో సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌‌మెంట్లు లేవు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను రిక్రూట్‌‌ చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే 8 మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌‌మెంట్లు ఉంటాయని ప్రకటించారు. ఆయా కాలేజీల్లో స్పెషలిస్టు డాక్టర్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చారు. సూపర్ స్పెషలిటీ పోస్టులకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు.