ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు

ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్​కో ఏఈ పట్టివేత  
  •     నల్గొండ జిల్లా చింతపల్లిలో  విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఆఫీసర్.. 
  •     మెదక్ జిల్లా నర్సాపూర్‌‌లో పట్టుబడిన ఏవో

అశ్వారావుపేట, వెలుగు : రైతు పొలంలో ట్రాన్స్​ఫార్మర్ పెట్టేందుకు ఓ ట్రాన్స్ కో ఏఈ రూ. లక్ష డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు గురువారం అతడిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్​కథనం ప్రకారం..ఏపీలోని జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొనకళ్ల ఆదిత్యకు అశ్వారావుపేట మండలం మద్దికొండలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ట్రాన్స్​ఫార్మర్ ఏర్పాటు చేయడానికి ట్రాన్స్ కో ఏఈ  ధరావత్​శరత్​కుమార్​ రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఖమ్మం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్​కు జంగారెడ్డిగూడెం రోడ్డులోని పేపర్ బోర్డు వద్ద డబ్బులు ఇస్తుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ రైడ్​లో ఏసీబీ ఇన్​స్పెక్టర్ ​సునీల్, శేఖర్, మహేశ్,​ కానిస్టేబుల్ శ్రీను పాల్గొన్నారు. 

రైతుకు కరెంట్​ కనెక్షన్​ ఇవ్వడానికి రూ.20 వేలు డిమాండ్​ 

దేవరకొండ(చింతపల్లి) :  ఓ రైతు పొలానికి కరెంట్​ కనెక్షన్​ ఇవ్వడానికి రూ.20 వేలు లంచం డిమాండ్​ చేసిన విద్యుత్ శాఖ ఆర్టిజన్ గ్రేడ్- 2 ఆఫీసర్​ను ఏసీబీ పట్టుకుంది. ఏసీబీ డీఎస్పీ జగదీశ్​కథనం ప్రకారం..నల్గొండ జిల్లా చింతపల్లి మండలం  మల్లారెడ్డిపల్లికి చెందిన రావి సూర్యనారాయణ కొంతకాలంగా కరెంట్​కనెక్షన్​ కోసం చింతపల్లి విద్యుత్​శాఖ ఆర్జిజన్​గ్రేడ్​–2 ఆఫీసర్​ నడింపల్లి వేణు చుట్టూ తిరుగుతున్నాడు. రూ.50 వేలు ఇస్తేనే పని చేస్తానని చెప్పడంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం చింతపల్లిలోని ఆఫీసులో అడ్వాన్సుగా రూ.20 వేలు తీసుకుంటున్న వేణును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ ఇన్​స్పెక్టర్లు వెంకట్రావు, రామారావు ఉన్నారు.  

ఫర్టిలైజర్​షాపు ఏర్పాటుకు  30 వేలడిగిండు..

నర్సాపూర్:  మెదక్ జిల్లా నర్సాపూర్‌‌లో ఫర్టిలైజర్‌‌ షాపు కోసం ట్రేడ్‌ లైసెన్స్‌ ఇవ్వడానికి లంచం డిమాండ్​ చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్ అనిల్‌కుమార్‌‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరుకు చెందిన వంగ నరేశ్‌.. నర్సాపూర్‌‌లో ఫర్టిలైజర్ షాపు పెట్టేందుకు లైసెన్స్ కోసం ఏవో అనిల్‌కుమార్‌‌ను సంప్రదించాడు. ఆయన రూ.30 వేలు లంచం అడిగాడు. నరేశ్‌ ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం నరేశ్‌..ఏవోకు అగ్రికల్చర్​ఆఫీసులో లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు అనిల్‌కుమార్‌‌ను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, సీఐ వెంకటరాజు గౌడ్ పాల్గొన్నారు.