కోల్‌కతా: తండ్రి చనిపోయిన బాధలో కూడా టీమిండియా యంగ్ క్రికెటర్ రింకు సింగ్ దేశం పట్ల తన నిబద్ధతను చాటుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా ఆదివారం (మార్చి 1) వెస్టిండీస్‌తో భారత్ ఆడనున్న డూ ఆర్ డై మ్యాచ్ కోసం అతడు జట్టుతో కలిశాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తైన గంటల వ్యవధిలోనే శనివారం (ఫిబ్రవరి 28) కోల్‌కతాలో జట్టులో చేరాడు.
తండ్రి చనిపోయిన బాధను కూడా దేశం కోసం లోపలే దిగమింగుకుని కీలకమైన మ్యాచ్ కోసం వచ్చిన రింకు సింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కష్టకాలంలో కూడా దేశమే ఫస్ట్ ప్రయారిటీ అని నిరూపించి రింకు సింగ్ మనసులు గెల్చుకున్నాడంటున్నారు నెటిజన్లు. సూపర్ 8 పోరులో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచులో రింకు సింగ్ ఆడలేదు.
కానీ వెస్టిండీస్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న కీలక మ్యాచులో రింకు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎల్లో కేకేఆర్ తరుఫున ఆడుతోన్న ఈ యంగ్ బ్యాటర్‌కు ఈడెన్ గార్డెన్స్ హోం గ్రౌండ్. ఈ మైదానంలో అతడికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. దీంతో వెస్టిండీస్‌తో జరిగే డూ ఆర్ డై మ్యాచులో రింకు ప్లేయింగ్ లెవన్‌లో ఉండే అవకాశం ఉంది.
రింకూ సింగ్ ఇంట్లో విషాదం:
టీమిండియా యంగ్ క్రికెటర్, స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రింకూ తండ్రి ఖాన్‌చంద్ర సింగ్ శుక్రవారం మృతి చెందారు. గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ నాలుగో స్టేజ్‌తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్‌లో చేర్పించారు.
పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి ట్రీట్‌మెంట్ అందించినా ఫలితం లేకపోయింది. చెన్నైలో జింబాబ్వేతో మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే తండ్రి మరణవార్త తెలియడంతో రింకూ జట్టును వీడాడు. తన హోమ్‌టౌన్ అలీఘడ్‌కు చేరుకొని తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు.
కాగా, ఖాన్‌చంద్ర సింగ్ అలీఘఢ్‌లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే కార్మికుడిగా పనిచేస్తూనే రింకూను క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. రింకూ తండ్రి మృతి పట్ల బీసీసీఐతో పాటు విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్ తదితర మాజీ క్రికెటర్లు, తోటి ప్లేయర్లు సంతాపం వ్యక్తం చేశారు.
