అమెరికా రక్షణ రంగంలో ఏఐ వినియోగంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఒకవైపు ఆంత్రోపిక్ సంస్థపై ట్రంప్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు సామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని OpenAI అమెరికా రక్షణ శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లోకి OpenAI ఎంట్రీ
ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ స్వయంగా డీల్ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమెరికా రక్షణ శాఖ అత్యంత రహస్యమైన మిలిటరీ నెట్‌వర్క్‌లో తమ ఏఐ మోడల్స్ వినియోగించేందుకు ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. బాధ్యతాయుతమైన ఏఐ వినియోగంపై ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు పేర్కొన్నారు.
Tonight, we reached an agreement with the Department of War to deploy our models in their classified network.
— Sam Altman (@sama) February 28, 2026
In all of our interactions, the DoW displayed a deep respect for safety and a desire to partner to achieve the best possible outcome.
AI safety and wide distribution of…
నిబంధనలు.. నిప్పులాంటి జాగ్రత్తలు
మిలిటరీ అవసరాల కోసం ఏఐని వాడుతున్నప్పటికీ.. కొన్ని కీలకమైన భద్రతా సూత్రాలకు లోబడే ఈ ఒప్పందం జరిగినట్లు ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు. ముఖ్యంగా అమెరికాలో మాస్ సర్వైలెన్స్ కోసం ఏఐని వాడకూడదు. అలాగే స్వయంప్రతిపత్తి కలిగిన ఆయుధ వ్యవస్థల విషయంలో ఫైనల్ నిర్ణయం ఖచ్చితంగా మనిషిదే అయి ఉండాలి. ఈ నిబంధనలకు రక్షణ శాఖ అంగీకరించిందని.. ఇవి చట్టబద్ధంగా అమలు అవుతాయని ఆల్ట్‌మన్ తెలిపారు.
సాంకేతిక పహారా.. క్లౌడ్ మౌలిక సదుపాయాలు
ఈ ఏఐ మోడల్స్ అదుపు తప్పకుండా ఉండేందుకు క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలను మాత్రమే ఉపయోగిస్తామని ఓపెన్ ఏఐ తెలిపింది. అలాగే వీటి పనితీరును పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఫీల్డ్ డిప్లాయ్‌మెంట్ ఇంజనీర్లను కూడా కేటాయించనున్నారు. మోడల్స్ నిర్దేశించిన సరిహద్దుల లోపే పనిచేసేలా ప్రత్యేక సాంకేతిక మెకానిజమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
►ALSO READ | క్రిప్టోల్లో తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్న తెలుగోళ్లు.. ఏపీ తెలంగాణలో సక్సెస్ సీక్రెట్ ఇదే..!
ఒకపక్క ఓపెన్ ఏఐ డీల్ జరుగుతుండగా.. మరోవైపు ఆంత్రోపిక్ సంస్థపై డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ప్రకటించారు. "మా గొప్ప సైన్యం యుద్ధాలు ఎలా చేయాలో, ఎలా గెలవాలో ఒక 'లెఫ్ట్ వింగ్, వోక్' కంపెనీ నిర్ణయించడాన్ని అమెరికా అంగీకరించదు" అంటూ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆంత్రోపిక్ తన సేఫ్టీ గార్డ్స్‌ను తొలగించడానికి నిరాకరించడంతో.. ఆ సంస్థ ఏఐ సేవలను వాడటం వెంటనే ఆపేయాలని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను ట్రంప్ ఆదేశించారు.
ప్రభుత్వాలకు, టెక్ సంస్థలకు మధ్య ఘర్షణ కంటే చర్చల ద్వారా ఒప్పందాలు కుదుర్చుకోవడమే ఉత్తమమని సామ్ ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. ఓపెన్ ఏఐకి వర్తించిన నిబంధనలనే మిగిలిన ఏఐ కంపెనీలకు కూడా వర్తింపజేయాలని ఆయన రక్షణ శాఖను కోరారు. మొత్తానికి అమెరికా రక్షణ వ్యూహాల్లో ఏఐ ఒక కీలక భాగస్వామిగా మారుతోంది.
