తెలుగు రాష్ట్రాల్లో క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల ధోరణిపై జియోటస్ సంస్థ విడుదల చేసిన 2025 వార్షిక రిపోర్ట్ ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిప్టోల్లో పెట్టుబడులు కేవలం వేగంగా లాభాల కోసం ఆరాటంలా కాకుండా.. చాలా సంయమనంతో కూడిన వ్యూహంతో సాగుతోందని తేలింది. దక్షిణ భారతదేశంలోని 5 ప్రధాన రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ డేటాను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే భిన్నమైన దారిలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఇన్వెస్టర్లు తక్కువ రిస్క్ తీసుకుంటూ.. దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నారట.
సౌత్ ఇండియా మొత్తంలో ఉన్న క్రిప్టో ట్రేడర్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా కలిపి సుమారు 16.9% గా ఉంది. అయితే మొత్తం ట్రేడింగ్ వాల్యూమ్ లో ఈ రెండు రాష్ట్రాల వాటా కేవలం 11.8% మాత్రమే. దీనిని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ట్రేడర్లు తరచుగా ట్రేడింగ్ జరపడం లేదని.. చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెడుతూ స్థిరంగా ముందుకు సాగుతున్నారని అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు వంటి అత్యధిక యాక్టివిటీ ఉన్న మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ ఒడిదుడుకులు తక్కువగా ఉన్నట్లు తేలింది.
తెలంగాణ ప్రొఫైల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దక్షిణాధిన అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం అయినప్పటికీ.. క్రిప్టో ట్రేడర్ల సంఖ్య, తలసరి ట్రేడింగ్ వాల్యూమ్‌లో తెలంగాణ చివరి స్థానంలో ఉంది. ఆదాయం ఎక్కువగా ఉంటేనే క్రిప్టోలో పెట్టుబడులు పెరుగుతాయనే అంచనా ఇక్కడ తప్పని తేలింది. తలసరి ఆదాయానికి, ట్రేడింగ్ వాల్యూమ్‌కు మధ్య సంబంధం దాదాపు సున్నా అని లెక్కలు చెబుతున్నాయి. దీనికి బదులుగా అర్బనైజేషన్, డిజిటల్ కనెక్టివిటీ మాత్రమే క్రిప్టో అడాప్షన్‌ను ప్రభావితం చేస్తున్నాయని స్పష్టమైంది.
మరోపక్కన ఏపీ విషయానికి వస్తే.. ఇది ఒక నమ్మకంతో కూడిన మార్కెట్ గా అవతరించింది. ఇక్కడి ఇన్వెస్టర్లలో 21.7% మంది 'HODL' కేటగిరీలోకి వస్తారు. అంటే వారు కొన్న క్రిప్టో అసెట్స్‌ను వెంటనే అమ్మేయకుండా దీర్ఘకాలం పాటు తమ వద్దే ఉంచుకుంటున్నారు. దక్షిణ భారత్‌లోని 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ తరహా ధోరణి అత్యధికంగా ఉండటం గమనార్హం. ఇది ఒక మెచ్యూర్డ్ మార్కెట్ లక్షణమని, వినియోగదారులు డిజిటల్ అసెట్స్ విలువను గుర్తించి భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అర్బనైజేషన్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 33.4% అతి తక్కువ రేటును కలిగి ఉండగా.. తెలంగాణ 40.9 శాతంతో మధ్యస్థంగా ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు, అవగాహన పెరిగే కొద్దీ క్రిప్టో మార్కెట్ మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇన్వెస్టర్లు తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదని జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడ్డారు. వారు మార్కెట్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ.. క్రమంగా తమ భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నారని గుర్తించబడింది. ఈ నిదానమైన ధోరణి భవిష్యత్తులో మరింత స్థిరమైన, సురక్షితమైన క్రిప్టో వాతావరణానికి పునాది వేస్తుందని సుబ్బురాజ్ చెబుతున్నారు.
