డిఫెన్స్‌‌‌‌కు మరింత పవర్‌‌‌‌!

డిఫెన్స్‌‌‌‌కు మరింత పవర్‌‌‌‌!

 

కమోవ్ 226టీ హెలికాప్టర్స్

ఇండియన్ ఎయిర్​ఫోర్స్, ఆర్మీ కోసం 200 యూనిట్ల కమోవ్ 226టీ హెలికాప్టర్లు కొనేందుకు 2015లో ఒప్పందం కుదిరింది. 140 హెలికాప్టర్ల తయారీలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ భాగస్వామిగా ఉంటుంది. మరో 60 ఫుల్లీ బిల్ట్ చాపర్లను రష్యన్ హెలికాప్టర్స్ సంస్థ సరఫరా చేస్తుంది.

 

 

 

కలష్నికోవ్ ఏకే203

 

7.5 లక్షల రష్యన్ అస్సాల్ట్ రైఫిల్స్​ను ఇండియన్ ఆర్మీకి సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. గత మార్చిలో ఇండియాలోని అమేథీ నియోజకవర్గానికి దగర్లో కోర్వా వద్ద ఇండో రష్యన్ జాయింట్ వెంచర్​ను ప్రారంభించారు. త్వరలోనే అక్కడ కలష్నికోవ్ ఏకే203 రైఫిల్స్​ను తయారు చేయనున్నారు. ఈ డీల్ విలువ ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ.7 వేల కోట్లు పైనే).

ప్రాజెక్ట్ 75-ఐ సబ్​మెరైన్లు

ప్రాజెక్ట్ 75-ఐ కింద ఆరు కొత్త సబ్​మెరైన్లు తయారు చేసేందుకు ఏడు బిలియన్ డాలర్ల(రూ.50 వేల కోట్లు)తో రోసోబోరోన్ ఎక్స్​పర్ట్ సంస్థ టెండర్ వేసింది. వచ్చే 30 ఏళ్లలో 12 సబ్​మెరైన్లను ఫారిన్ టెక్నాలజీతో, మరో 12 వెస్సెల్స్​ను స్వదేశీ టెక్నాలజీతో నిర్మించాలని ఇండియన్​ నేవీ ప్లాన్ చేసింది. ఇప్పటికే ఆరు స్కార్పేన్ క్లాస్ సబ్‌‌మెరైన్ల నిర్మాణం పూర్తయింది.

 

క్రివాక్-3 ఫ్రిగేట్స్

నాలుగు రష్యన్ క్రివాక్–3 క్లాస్ ఫ్రిగేట్స్ కొనుగోలు చేసేందుకు 2018 అక్టోబర్​లో ఇండియన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. రష్యాలోని యంతర్ షిప్​యార్డులో పాక్షికంగా నిర్మించిన రెండు షిప్పులు సిద్ధంగా ఉన్నాయి. వాటిని పూర్తిగా నిర్మించేందుకు 1.5 బిలియన్ డాలర్ల(సుమారు 10.7 వేల కోట్లు)ను ఇండియా చెల్లించనుంది. మిగతా రెండు ఫ్రిగేట్స్​ను గోవా షిప్​యార్డు లిమిటెడ్​లో నిర్మిస్తారు. ఇండియా ఇప్పటికే ఆరు క్రివాక్ ఫ్రిగేట్స్ ను కొనుగోలు చేసింది. అందులో ఐఎన్ఎస్ తల్వార్, త్రిశూల్, తాబర్ లను 2003–2004లో నేవీలోకి ప్రవేశపెట్టగా.. ఐఎన్ఎస్ తేగ్, తర్కశ్, త్రికండ్ లను 2012–13లో ప్రవేశపెట్టారు.

ఇగ్లా-ఎస్

నేవీ, ఎయిర్​ఫోర్స్, ఆర్మీ కోసం ఇగ్లా-ఎస్ మిస్సైల్​ను కొనాలని గతేడాది నవంబర్​లో డిఫెన్స్ మినిస్ట్రీ నిర్ణయించింది. 5,175 ఇగ్లా-ఎస్ మిస్సైళ్లు, 800 లాంచర్లు సరఫరా చేసేందుకు ‘రోసోబోరోన్ ఎక్స్​పర్ట్’ సంస్థ 1.5 బిలియన్ డాలర్ల (సుమారు 10.7 వేల కోట్లు)తో బిడ్ వేసింది. ఇది షార్ట్ రేంజ్ ఎయిర్​డిఫెన్స్​సిస్టమ్. ఇగ్లా-ఎస్ మిసైళ్ల రేంజ్ 8 కిలోమీటర్లు. శత్రు విమానాల నుంచి సోల్జర్లు తప్పించుకునేందుకు ఉపయోగపడుతుంది.  ఇది చాలా పాత సిస్టమ్. రష్యా కూడా వేరే సిస్టమ్​కు మారింది. ‘9కే333 వెర్బా’ అనే దాన్ని వాడుతోంది.

బ్రహ్మోస్ మిస్సైళ్లు

బ్రహ్మోస్ మిస్సైళ్లను ఇండియా, రష్యా కలిసి డెవలప్ చేశాయి. ఇండియన్ వార్​షిప్పులను ఇప్పుడు హైదరాబాద్​లో నిర్మిస్తున్నాయి. నాలుగు కొత్త క్రివాక్-3 ఫ్రిగేట్స్​కు బ్రహ్మోస్ మిస్సైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ ఈ మధ్యే ప్రకటించింది. ఒక్కో దానికి రూ.1,250 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే విశాఖపట్నంలోని నాలుగు వార్​షిప్పుల కోసం బ్రహ్మోస్ మిసైళ్లు సిద్ధం చేస్తున్నారు.

సుఖోయ్30ఎంకేఐ

222 ట్విన్ ఇంజిన్ హెవీ సుఖోయ్30ఎంకేఐ ఫైటర్లను నాసిక్​లోని హిందుస్థాన్   ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. మరో 18 ఎయిర్​క్రాఫ్టుల నిర్మాణానికి కూడా చర్చలు నడుస్తున్నాయి. ఒక్కో సుఖోయ్ ఎయిర్​క్రాఫ్టు ధర రూ.450 కోట్ల వరకు ఉంటుంది. మరో 18 ఎయిర్​క్రాఫ్టుల కోసం 1.15 బిలియన్‌‌ డాలర్ల(సుమారు రూ.8 వేల కోట్లు)ను ఐఏఎఫ్ చెల్లించనుంది. వచ్చే ఏడాది సుఖోయ్30ఎంకేఐ ఫైటర్ల డెలివరీ ప్రారంభం అవుతుంది. 2022 నాటికి పూర్తవుతుంది. దీంతో ఐఏఎఫ్ సుఖోయ్ ఫైటర్ల సంఖ్య 290 కి చేరుతుంది.

మీడియం ఫైటర్లు

114 మీడియం రేంజ్ ఫైటర్లను  కొనడానికి  ఐఏఎఫ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు రష్యాకు చెందిన మిగ్35, సుఖోయ్35 విమానాలు పోటీ పడుతున్నాయి. 57 మల్టీరోల్ క్యారియర్ ఫైటర్లను కొనుగోలు చేసేందుకు నేవీ చర్యలు ప్రారంభించింది.