ఇస్లామిక్ రాజ్య స్థాపనకు పీఎఫ్ఐ కుట్ర 

ఇస్లామిక్ రాజ్య స్థాపనకు పీఎఫ్ఐ కుట్ర 

కొచ్చి: టెర్రరిస్టు గ్రూపుల్లో చేరేలా మన దేశ యువత ను పాపులర్ ఫ్రంట్ ఇండియా(పీఎఫ్ఐ) ప్రేరేపిస్తోందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) తెలిపింది. లష్కరే తాయిబా, ఐఎస్, అల్ ఖైదా లాంటి టెర్రర్ గ్రూపుల్లో చేరేలా యువతను ప్రోత్సహిస్తోందని చెప్పింది. జిహాద్​లో భాగంగా దేశంలో టెర్రర్ దాడులకు పాల్పడి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని కుట్ర పన్నిందని పేర్కొంది. కొచ్చిలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. కేరళలో అరెస్టు చేసిన 10 మందిని కస్టడీకి కోరుతూ ఈ నెల 22న కోర్టుకు ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టు అందజేసింది. ఇప్పుడా రిపోర్టు బయటకు వచ్చింది. ప్రభుత్వ విధానాలను వక్రీకరిస్తున్న పీఎఫ్ఐ.. దేశంపై ఓ వర్గ ప్రజల్లో విద్వేషం పెంచుతోందని రిపోర్టులో ఎన్ఐఏ తెలిపింది. మరో వర్గంలోని ప్రముఖులను టార్గెట్ చేసుకొని దాడులకు కుట్ర చేస్తున్నట్లు చెప్పింది. కాగా, టెర్రర్ లింకులు ఉన్నాయనే సమాచారంతో దేశవ్యాప్తంగా ఉన్న పీఎఫ్ఐ ఆఫీసులు, ఆ సంస్థ నేతల ఇండ్లలో ఎన్ఐఏ ఇటీవల సోదాలు చేసింది. మొత్తం 11 రాష్ట్రాల్లో 
106 మందిని అరెస్టు చేసింది. 

పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు.. 

పీఎఫ్ఐపై ఎన్ఐఏ దాడులను నిరసిస్తూ శుక్రవారం మహారాష్ట్రలోని పుణెలో మద్దతుదారులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ ముందు నిరసన తెలపగా 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ టైమ్ కొంతమంది పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పలుమార్లు నినాదాలు చేశారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వాళ్లపై చర్యలు తీసుకుంటామని సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.